నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం

హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో విక్రయాలు జరుపుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు.

Updated : 27 May 2023 06:32 IST

రూ.1.03 కోట్ల విలువైన 36.5 క్వింటాళ్ల   పత్తి విత్తనాలు స్వాధీనం
వేర్వేరు కేసుల్లో తొమ్మిది మంది అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌- వికారాబాద్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో విక్రయాలు జరుపుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.03 కోట్ల విలువైన 36.5 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనపరచుకున్నారు. శుక్రవారం సైబరాబాద్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, వికారాబాద్‌లో ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి వేర్వేరుగా విలేకరుల సమావేశాలు నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. కర్ణాటకకు చెందిన సదాశివారెడ్డి, తాయప్ప, బి.రామ్‌చందర్‌, బి.సురేష్‌ హైదరాబాద్‌ శివారు మీర్‌పేట్‌ కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్నారు. శుక్రవారం ఓ ట్రక్కులో విత్తనాలు తరలిస్తున్న వీరిపై బాలానగర్‌ ఎస్‌వోటీ, బాచుపల్లి పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వారి నుంచి నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు. మరోవ్యక్తి పరారీలో ఉన్నాడు. మరోకేసులో నెల్లూరు జిల్లా కావలికి చెందిన జి.వెంకటరమణ.. వికారాబాద్‌ జిల్లాకు చెందిన రఘుపతిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి షాబాద్‌లోని రైతులకు పత్తి విత్తనాలు విక్రయిస్తున్నాడు. తాజాగా నకిలీ విత్తనాలు తరలిస్తున్న వాహనాన్ని రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ, షాబాద్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు కేసుల్లో ఏడుగురి నుంచి రూ. 85 లక్షల విలువైన 26.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనపరచుకున్నట్లు సీపీ వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో వికారాబాద్‌ సీఐ శ్రీను, టాస్క్‌ఫోర్స్‌ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన జాగర్లమూడి శ్రీనివాస్‌రావు దగ్గర 2 కిలోల పత్తి విత్తనాలు లభించాయి. వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో విక్రయించడానికి కర్నూలు నుంచి నకిలీ పత్తి విత్తనాలు తీసుకొచ్చినట్లు తేలింది. నకిలీ విత్తనాల విక్రయానికి వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలానికి వచ్చిన ప్రకాశం జిల్లా వేటపాలెంకు చెందిన కరణం వెంకటేశ్వర్లును పోలీసులు పట్టుకున్నారు. కర్ణాటక రాష్ట్రంలో నిల్వ చేసిన నకిలీ విత్తనాలను స్వాధీనపరచుకున్నారు. వీరిద్దరి నుంచి రూ.18 లక్షల విలువైన 10 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనపరచుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని