TSPSC Paper Leak: చాట్‌ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్‌ డివైస్‌తో చేరవేత!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు నగర సిట్‌ నిర్ధారించింది.

Updated : 30 May 2023 09:55 IST

టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీలో కొత్త కోణం
విద్యుత్‌ శాఖ డీఈ బండారం బట్టబయలు

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యుత్‌శాఖ డీఈ రమేశ్‌ కనుసన్నల్లో పెద్దఎత్తున ప్రశ్నపత్రాలు చేతులు మారినట్టు నగర సిట్‌ నిర్ధారించింది. ఏఈఈ/డీఏఓ పరీక్షలకు హాజరయ్యే కొందరు అభ్యర్థులతో ఒప్పందం కుదుర్చుకొని సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్లు సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఇప్పటివరకూ ప్రశ్నపత్రాలను విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులో తొలిసారి నిందితులు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ పరికరాలను ఉపయోగించడం సంచలనంగా మారింది. సోమవారం డీఈ రమేశ్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ డివైజ్‌ ద్వారా పరీక్ష రాసిన ప్రశాంత్‌, నరేష్‌, మహేశ్‌, శ్రీనివాస్‌లను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన మరో 20 మంది అభ్యర్థులను పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

10 నిమిషాలకు ముందు ప్రశ్నపత్రం

ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలు వచ్చాక తనకు పరిచయమున్న టీఎస్‌పీడీసీఎల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ సురేశ్‌ను దళారిగా మార్చాడు. ఇతను ఏఈఈ/డీఏవో ప్రశ్నపత్రాలను 25 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. సురేశ్‌ ద్వారా డీఈ రమేశ్‌ కొన్ని ప్రశ్నపత్రాలు తీసుకొని అమ్మినట్లు తెలుస్తోంది. ఏఈఈ, డీఏఓ ప్రశ్నపత్రాలు కావాలంటూ మరికొందరు అభ్యర్థుల నుంచి ఒత్తిడి రావటంతో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జవాబులు చేరవేసేలా ఏడుగురు అభ్యర్థులతో ఒక్కొక్కరి నుంచి రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు డీఈ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వారికి ముందుగానే మైక్రోఫోన్‌ (ఎలక్ట్రానిక్‌ డివైజ్‌)లు ఇచ్చాడు. అభ్యర్థులు వాటిని బెల్ట్‌లో భద్రపరచుకుని పరీక్ష హాలుకు చేరారు. అక్కడి ఎగ్జామినర్‌ సహాయంతో అభ్యర్థులు ప్రశ్నపత్రాల ఫొటోలు తీసుకున్నారు. వాటిని పరీక్ష ప్రారంభమయ్యే 10 నిమిషాల ముందు రమేశ్‌ వాట్సప్‌కు చేరవేశారు. చాట్‌ జీపీటీ ద్వారా సమాధానాలను సేకరించి వాట్సప్‌ ఫోన్‌కాల్‌ ద్వారా పరీక్ష హాలులోని ఏడుగురు అభ్యర్థులకు జవాబులు చేరవేశాడు. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించిన ఎగ్జామినర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని