దారి కాచి తెదేపా వర్గీయులపై దాడి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దారి కాచి ఇనుప సుత్తి, రాడ్లతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను దారుణంగా కొట్టారు.

Published : 30 May 2023 05:40 IST

ముగ్గురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
వైకాపా కార్యకర్తల అరాచకం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా కార్యకర్తలు ఆదివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. దారి కాచి ఇనుప సుత్తి, రాడ్లతో ముగ్గురు తెదేపా కార్యకర్తలను దారుణంగా కొట్టారు. గాయపడిన వారిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు ముస్లింల కబర్‌స్థాన్‌ కోసం ఇటీవల స్థానిక రాడార్‌ కేంద్రం వద్ద రెండెకరాల స్థలం కేటాయించారు. ఆ స్థలం తమ ప్రమేయం వల్లే సమకూరిందనే ప్రచారం విషయంలో ఇంగ్లీష్‌పాలేనికి చెందిన వైకాపాలోని రెండు వర్గాలవారు ఆదివారం ఘర్షణ పడి ఒకరిపై ఒకరు చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.

పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించారు. ఒక వర్గంలో నిందితుడిగా ఉన్న మసీదు పెద్దను పరామర్శించేందుకు తెదేపాకు చెందిన సయ్యద్‌ బాజీ, చోటాబాబు, తదితరులు స్టేషన్‌కు వెళ్లారు. దీంతో వైకాపాలోని రెండో వర్గానికి చెందిన కార్యకర్తలు మోబిన్‌, గౌస్‌, మునీర్‌, తదితరులు ఆదివారం రాత్రి ఇంగ్లీష్‌పాలెం జెండా సెంటరులో కాపుకాసి బాజీ, చోటాబాబు, రిజ్వాన్‌లు ఇంటికి వెళ్తుండగా ఇనుప సుత్తి, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ముగ్గురిని జిల్లా సర్వజనాసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాజీ, బాబులను మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపారు. బాజీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని