కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వారంతా కలిసి సరదాగా పర్యాటక ప్రాంతాల్ని చూసి రావాలని కారులో బయలుదేరారు.

Published : 30 May 2023 05:40 IST

10 మంది దుర్మరణం
ముగ్గురి పరిస్థితి విషమం

మైసూరు, న్యూస్‌టుడే: ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వారంతా కలిసి సరదాగా పర్యాటక ప్రాంతాల్ని చూసి రావాలని కారులో బయలుదేరారు. అప్పటిదాకా ఆనందంగా గడిపిన వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. కురుబూరు గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలలతో కలిపి పది మంది మరణించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా బళ్లారి జిల్లా సంగనకల్లు నుంచి మైసూరు పర్యటనకు వచ్చారు. మలెమహదేశ్వర బెట్టకు వెళ్లి, మైసూరుకు తిరిగి వస్తున్న క్రమంలో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది.

ఘటనా స్థలంలో నలుగురు మరణించగా, ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఆరుగురు అసువులు బాశారు. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రులను చామరాజనగర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను మంజునాథ్‌ (35), కొట్రేశ్‌ (45), సుజాత (40), సందీప్‌ (23), పూర్ణిమ (30), గాయత్రి (28), శ్రావ్య (5), పవన్‌ (8), కార్తిక్‌ (8), కారు డ్రైవరు ఆదిత్య (34)గా గుర్తించారు. గాయపడిన వారిలో జనార్దన్‌ (45), పునీత్‌ (4), శశికుమార్‌ (24) పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. మృతుల్లో మూడు కుటుంబాలకు చెందిన వారుండగా.. డ్రైవర్‌ మైసూరు ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని