పేరు మార్చి.. క్యూనెట్ కనికట్టు!
ఆరేళ్ల క్రితం నిషేధించిన క్యూనెట్ సంస్థ వి-ఎంపైర్‌గా పేరు మార్చుకొని అమాయకులు, నిరుద్యోగులను మోసగిస్తోంది.
ప్రధాన నిందితుడు సహా ముగ్గురి అరెస్ట్
35 బ్యాంకు ఖాతాల్లో రూ.54 కోట్లు సీజ్
ఈనాడు, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం నిషేధించిన క్యూనెట్ సంస్థ వి-ఎంపైర్‌గా పేరు మార్చుకొని అమాయకులు, నిరుద్యోగులను మోసగిస్తోంది. మార్చిలో సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నపుడు క్యూనెట్ బాగోతం వెలుగుచూసింది. అప్పట్లో 12 మందిని అరెస్టుచేశారు. అనంతరం ఈ కేసు సీసీఎస్‌కు బదిలీచేశారు. డీసీపీ శబరీష్ ఆధ్వర్యంలో 3 నెలలుగా గాలించి ప్రధాన సూత్రధారి బెంగళూరుకు చెందిన జి.రాజేష్ అలియాస్ రాజేష్‌ఖన్నా, నగరానికి చెందిన మనీష్ కత్తి, సయ్యద్ అజ్మత్ మెహ్దీ సజ్జద్‌లను అరెస్టుచేశారు. నగరంలో బోనస్‌లు, బహుమతుల పేరిట ఎరవేస్తూ మోసాలకు పాల్పడుతున్న రెండు మల్టీమార్కెటింగ్ సంస్థలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మంగళవారం సీపీ సీవీ ఆనంద్.. నగర డీసీపీలు జోయల్ డేవిస్, సాయిచైతన్య, చందనాదీప్తి, శబరీష్, రూపేష్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
గుమ్మడిల్లి రాజేష్ అలియాస్ రాజేష్‌ఖన్నా స్వస్థలం ప్రకాశం జిల్లా. ఎంబీఏ పూర్తిచేసిన ఇతడు హాంకాంగ్ కేంద్రంగా ప్రారంభించిన క్యూనెట్‌లో పనిచేశాడు. 2017లో దాన్ని నిషేధించాక వి-ఎంపైర్ పేరుతో దక్షిణ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతడి అనుచరులు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో కార్యాలయం ప్రారంభించి మోసాలకు తెరలేపారు. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేటు లిమిటెడ్‌లో పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చంటూ ప్రచారంచేశారు. రాజేష్ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించారు. నెలకు రూ.20,000 పెట్టుబడితో రూ.60,000... రూ.50,000తో రూ.లక్షన్నర సంపాదన వస్తుందంటూ మభ్యపెట్టారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల యువతీ, యువకులు అప్పులు తెచ్చి మరీ ఇతడి చేతికిచ్చారు. దాదాపు 150 మంది బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలుచేశారు. కొంతకాలం పెట్టుబడికి ఆదాయం ఇస్తూ వచ్చినా తరువాత ముఖం చాటేసేవారు. చెల్లించిన సొమ్ము వెనక్కి తీసుకోవాలంటే ఒక్కొక్కరు మరో ఇద్దరిని సభ్యులుగా చేర్పించాలంటూ షరతు విధించారు. దీంతో తమ సొమ్ము తిరిగి రాబట్టుకునేందుకు బాధితులు నిర్వాహకులు చెప్పినట్టు చేసేవారు. ఈ మోసాలు వెలుగుచూడడంతో విహాన్ సంస్థకు చెందిన 35 బ్యాంకు ఖాతాల్లో రూ.54 కోట్లు సీజ్ చేశామని సీపీ చెప్పారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడైన రాజేష్‌ఖన్నా కోసం రెండు నెలలు గాలించి అరెస్టు చేశామని సీసీఎస్ డీసీపీ శబరీష్ తెలిపారు.
గొలుసుకట్టు మోసాలు..
రూ.2000 ఖరీదుచేసే చేతివాచీని మల్టీమార్కెటింగ్ సంస్థలో సభ్యత్వం కోసం రూ.59,020కి విక్రయిస్తున్నారని సీపీ తెలిపారు. ఇలా పిరమిడ్ తరహాలో రాయితీలు, బోనస్‌లు, బహుమతుల ఎరవేస్తూ నగరంలో మల్టీమార్కెటింగ్ మాయాజాలంతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని వెల్లడించారు. వీటికి సంబంధించి రెండు సంస్థలపై కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. ఇ-స్టోర్ ఇండియా (యాక్సిస్ ఇ క్రాప్ ప్రైవేటు లిమిటెడ్, ఆయుర్వేదిక్ హెల్త్ ప్రొడక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్) పేరుతో మనీష్, సయ్యద్ అజ్మల్ మార్కెటింగ్ ఇన్‌ఛార్జులుగా సూపర్ మార్కెట్ స్కీమ్ ప్రారంభించారు. స్కీంలో చేరిన సభ్యులు ప్రతి నెలా రూ.9000 ఉత్పత్తులు కొనుగోలు చేస్తే లాభాలు, రాబడి అందిస్తామంటూ ఆశచూపారు. నగరాలు, పట్టణాల్లో ఇ-స్టోర్ ప్రారంభించేందుకు రూ.25 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.లక్ష లాభం వస్తుందంటూ నమ్మించడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 మంది రూ.కోట్లు ముట్టజెప్పారు. వీరు ఇలా దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలుచేశారు. కొన్నినెలలు ఠంచనుగా అందజేసినా, తరువాత చేతులెత్తేశారు. ఈ సంస్థల బాధితులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారని సీపీ తెలిపారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి బ్యాంకు ఖాతాల్లోని రూ.6.50 కోట్లు సీజ్‌చేశామని పేర్కొన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే డయల్ 100, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
తెలంగాణలో సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్