సాహిల్‌కు పోలీసు కస్టడీ

దేశ రాజధాని దిల్లీలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్‌కు స్థానిక మెజిస్టీరియల్‌ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది.

Published : 31 May 2023 04:58 IST

నిందితుడిని పట్టించిన ఫోన్‌కాల్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతంలో 16 ఏళ్ల బాలికను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు సాహిల్‌కు స్థానిక మెజిస్టీరియల్‌ కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. మంగళవారం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరచగా.. విచారించిన డిప్యూటీ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ జ్యోతి నైన్‌ పోలీసు కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నిందితుడిని పోలీసులు సాధారణ కోర్టు సమయానికి ముందే హాజరుపరిచారు. ఆదివారం రాత్రి నడిరోడ్డుపై సాక్షి అనే 16 ఏళ్ల బాలికను సాహిల్‌ కత్తితో 20 సార్లు పొడిచి బండరాయితో మోది కిరాతకంగా చంపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని యూపీలోని బులంద్‌శహర్‌లో సోమవారం అరెస్టు చేశారు.

15 రోజుల క్రితమే కత్తి కొనుగోలు

సాక్షి హత్యకు ఉపయోగించిన కత్తిని సాహిల్‌ 15 రోజుల క్రితమే ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఆ కత్తిని రిథాలా మెట్రో స్టేషన్‌ సమీపంలోని పొదల్లో పాడేసినట్లు పేర్కొన్నారు. బులంద్‌శహర్‌ వెళ్లిన సాహిల్‌ తన తండ్రికి ఫోన్‌ చేయడంతో లొకేషన్‌ను గుర్తించి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. మాజీ ప్రియుడికి దగ్గర అవుతోందన్న కారణంతోనే సాక్షిని అంతమొందించినట్లు సాహిల్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. దాడికి ముందు సాహిల్‌ మరో వ్యక్తితో మాట్లాడుతున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైనట్లు గుర్తించారు. ఘటన జరిగిన రోజు సాహిల్‌ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.  

రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన కేజ్రీవాల్‌

మరోవైపు.. హత్యకు గురైన సాక్షి కుటుంబ సభ్యులను భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలకు చెందిన నేతలు మంగళవారం పరామర్శించారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బాలిక కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు