టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌

ఆయన విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారి. పది కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను దక్కించుకొని భారీగా లాభపడ్డాడు.

Updated : 01 Jun 2023 05:19 IST

ఇన్విజిలేటర్ల సహాయంతో ఏఈ రమేష్‌ ప్రణాళిక
సిట్‌ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి  

ఈనాడు, హైదరాబాద్‌: ఆయన విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారి. పది కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాలను దక్కించుకొని భారీగా లాభపడ్డాడు. ఎవరికీ పట్టుబడబోననే ధీమాతో ఉన్నాడు. సిట్‌ పోలీసుల దర్యాప్తుతో ఆయన బండారం, అంతకుముందు రిహార్సల్‌గా ప్రయత్నించిన మరో బాగోతం బయటపడ్డాయి. టీఎస్‌పీఎస్సీ ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ చేయించిన విషయం సంచలనంగా మారింది.

సైదాబాద్‌కు చెందిన పూల రమేష్‌ 2007లో విద్యుత్‌ శాఖ ఏఈగా కొలువు సంపాదించాడు. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో పనిచేస్తున్నాడు. గతంలో నార్కట్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రికి వెళ్లినప్పుడు అక్కడి వైద్యుడి ద్వారా సురేష్‌ పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో సైదాబాద్‌లోని సురేష్‌ ఇంట్లోనే అద్దెకు దిగాడు. ఇదే సురేష్‌.. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌కుమార్‌కు స్నేహితుడు. అంతా ఒకే భవన సముదాయంలో ఉండేవారు. సురేష్‌ ద్వారా పరీక్ష ప్రశ్నపత్రాలను తీసుకొన్న రమేష్‌ వాటిని 30 మందికి విక్రయించి 70:30 చొప్పున వాటాలు పంచుకున్నారు. రమేష్‌కు సాంకేతిక పరిజ్ఞానంతోపాటు పరీక్షల నిర్వహణ, కేంద్రాలు తదితర అంశాలపై పట్టుంది. దాన్ని అవకాశంగా మరో ప్రణాళిక రూపొందించారు. గతంలో నిర్వహించిన ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పరీక్షలో హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌తో సమాధానాలు చేరవేసేలా ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆ అనుభవాన్ని ఏఈఈ, డీఏఓ పరీక్షలకు ఉపయోగించుకున్నట్లు సమాచారం.

ఎలా అమలు చేశారంటే...

ఈ ఏడాది జనవరి 22న డీఏవో, ఫిబ్రవరి 26న ఏఈఈ పరీక్షలు జరిగాయి. ఏఈ రమేష్‌... పరీక్షలకు కొద్దిరోజుల ముందుగానే ఏడుగురు అభ్యర్థులతో మాట్లాడాడు. ఒక్కొక్కరి నుంచి రూ.30-40 లక్షలకు బేరసారాలు జరిపి అడ్వాన్సుగా రూ.1.10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అనంతరం సొమ్ములిచ్చిన అభ్యర్థుల పరీక్ష కేంద్రాల వివరాలను తెలుసుకున్నాడు. ఆ కళాశాల ప్రిన్సిపల్‌, ఇన్విజిలేటర్లకు భారీగా నగదు చెల్లించి సహకరించేలా ఏర్పాట్లు చేశాడు. పరీక్షా కేంద్రాల్లో ఆ అభ్యర్థులకిచ్చే ప్రశ్నపత్రాల ‘కోడ్‌’ వివరాలను ముందుగానే అంచనా వేశాడు. పరీక్ష రోజు అభ్యర్థులకు హైటెక్‌ విధానంలో సమాధానాలు చేరవేసేందుకు అవసరమైన మైక్రోఫోన్లు, డివైస్‌లు, వైర్లు, బ్లూటూత్‌లను కొన్నాడు. వాటిని అభ్యర్థుల లోదుస్తులు, బెల్టులు, చెవుల్లో మైక్రోఫోన్లు అమర్చి ఇన్విజిలేటర్ల సహాయంతో లోపలికి పంపారు. అభ్యర్థులకు కేటాయించిన ప్రశ్నపత్రాల ‘కోడ్‌’ల ప్రకారం... పరీక్షకు గైర్హాజరైన ఇతర అభ్యర్థుల ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్లు ఫొటోలు తీసి రమేష్‌కు వాట్సప్‌ చేశారు. బయట ఉన్న రమేష్‌ ప్రశ్నపత్రాల ‘కోడ్‌‘లకు అనుగుణంగా చాట్‌ జీపీటీ, బోధనా నిపుణుల సహకారంతో సమాధానాలు సేకరించి... ఫోన్‌ చేయగానే బ్లూటూత్‌ ద్వారా ఆటోమేటిక్‌గా రిసీవర్‌ నుంచి అభ్యర్థులకు జవాబులు చేరవేశాడు. సిట్‌ దర్యాప్తులో టాపర్ల జాబితా బయటకు తీసినప్పుడు ఈ అభ్యర్థుల గుట్టు బయటపడింది. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించినప్పుడు హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ వెలుగు చూసినట్టు తెలుస్తోంది.


మరో 13 మంది అభ్యర్థుల డిబార్‌

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మందిని పోటీ పరీక్షలకు హాజరుకాకుండా టీఎస్‌పీఎస్సీ డీబార్‌ చేసింది. ఇప్పటికే డిబార్‌ చేసిన 37 మందితో కలిపి మొత్తం డిబారైన అభ్యర్థుల సంఖ్య 50కి చేరింది. డిబార్‌లపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు, వివరణలు ఉంటే రెండురోజుల్లో ఇవ్వాలని స్పష్టంచేసింది.
డిబారైన అభ్యర్థులు: పూల రవి, రాయపురం విక్రమ్‌, రాయపురం దివ్య, ధనావత్‌ భరత్‌ నాయక్‌,  పాశికంటి రోహిత్‌కుమార్‌, గాదే సాయిమధు, లోకిని సతీష్‌కుమార్‌, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్‌ శ్రీనునాయక్‌, భూక్యా మహేష్‌, ముదావత్‌ ప్రశాంత్‌, వదిత్య నరేష్‌, పూల రమేష్‌కుమార్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని