కారుతో ఢీకొట్టి.. 100 మీటర్లు లాక్కెళ్లి.. ముచ్చింతల్‌లో హెడ్‌కానిస్టేబుల్‌ దౌర్జన్యం

తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న యువకుడిని చితకబాదడంతో.. అడిగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలపై హెడ్‌కానిస్టేబుల్‌ దాడికి పాల్పడ్డాడు.

Updated : 01 Jun 2023 20:04 IST

దాడి చేశారని ప్రశ్నించినందుకు ఘాతుకం

శంషాబాద్‌, న్యూస్‌టుడే: తమ ఇంటి ముందు నుంచి వెళ్తున్న యువకుడిని చితకబాదడంతో.. అడిగేందుకు వెళ్లిన ఇద్దరు మహిళలపై హెడ్‌కానిస్టేబుల్‌ దాడికి పాల్పడ్డాడు. దీనిపై హెడ్‌ కానిస్టేబుల్‌ను ప్రశ్నించిన వ్యక్తిని కారుతో ఢీకొట్టి బెదిరించిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.శ్రీధర్‌కుమార్‌ తెలిపిన కథనం ప్రకారం.. ముచ్చింతల్‌కు చెందిన ధార కృష్ణ-బాలమణి దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్‌ పోలీసుశాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలంగా అతని ఇంటి ముందు రహదారిపై వెళ్తున్న గ్రామస్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఘర్షణ పడుతున్నాడు. తన పొలానికి వెళ్తున్న ధార కృష్ణ కుమారుడు పవన్‌కుమార్‌తో హెడ్‌ కానిస్టేబుల్‌, అతని కుమారుడు వంశీ అకారణంగా గొడవపడి చితకబాదడంతో పవన్‌ స్పృహ కోల్పోయాడు. దీంతో పవన్‌ తల్లి బాలమణి, సోదరి రూప వెళ్లి ప్రశ్నించగా.. కోపోద్రిక్తుడైన హెడ్‌ కానిస్టేబుల్‌ జ్ఞానేశ్వర్‌.. బాలమణి, రూపలపై చేయిచేసుకున్నాడు. అనంతరం బంధువు రాజు సహా పలువురు గ్రామస్థులు వెళ్లి నిలదీయగా.. జ్ఞానేశ్వర్‌ తన కారు తీసి వేగంగా వారిని ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. తప్పించుకునే క్రమంలో రాజు కారు బానెట్‌పై పడగా.. అతడిని అలాగే 100 మీటర్ల దూరం లాక్కెళ్లి చంపేస్తా అంటూ జ్ఞానేశ్వర్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. గాయపడిన బాలమణి, రూప, పవన్‌, రాజులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని