విషాహారం తిని 86 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అస్వస్థత

ఇంజినీరింగ్‌ కళాశాల వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం సమీపంలోని కళాశాల ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది.

Published : 01 Jun 2023 05:02 IST

బుక్కరాయసముద్రం, న్యూస్‌టుడే: ఇంజినీరింగ్‌ కళాశాల వసతిగృహంలో ఉంటున్న విద్యార్థులు విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన అనంతపురం సమీపంలోని కళాశాల ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల పరిధిలోని రోటరీపురం గ్రామ శివారుల్లో స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్య సలహాదారు సాంబశివారెడ్డి దంపతులు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుతున్న కొందరు విద్యార్థులు ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇంజనీరింగ్‌ కళాశాల ఆవరణలోనే వసతిగృహాలు ఉన్నాయి. ఇక్కడే విద్యార్థులు మంగళవారం రాత్రి భోజనం చేశారు. ఆహారం విషతుల్యం కావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి విద్యార్థులు క్రమంగా అస్వస్థతకు గురవుతూ వచ్చారు. 86 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా చికిత్స అందించేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి 26 మంది విద్యార్థులను తరలించారు. ఆరుగురిని అత్యవసర విభాగంలో చేర్చారు. విషయం తెలుసుకున్న జిల్లా అధికారుల బృందం కళాశాల వసతిగృహానికి చేరుకుని ఆహార నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. విద్యార్థులు క్రమంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని