మలక్‌పేటలో మాస్ కాపీయింగ్ కంట్రోల్‌రూం
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంతక్రితం దాకా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం వెలికి రాగా ఇప్పుడు పరీక్ష కేంద్రం నుంచి వాట్సప్‌లో కూడా బయటకు వచ్చినట్టు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది.
వాట్సప్‌లో చేర్చింది టోలిచౌకీలో ఉండే ప్రిన్సిపల్
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణం
ఈనాడు, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇంతక్రితం దాకా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం వెలికి రాగా ఇప్పుడు పరీక్ష కేంద్రం నుంచి వాట్సప్‌లో కూడా బయటకు వచ్చినట్టు సిట్ బృందం నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో హైటెక్ మాస్‌కాపీయింగ్‌కు తెరలేపిన విద్యుత్తుశాఖ డీఈఈ పూల రమేశ్ లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అతడి ముఠా ఏఈఈ, డీఏవో పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపోయేలా బఠాణి గింజంత స్పీకర్‌ను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష అనంతరం చెవిలో నుంచి దాన్ని బయటికి తీసేందుకు ఇయర్‌బడ్ రూపంలో ఉన్న మాగ్నెటిక్ పరికరాన్ని వినియోగించారు. అలాగే చిన్నపాటి చిప్‌తో కూడిన డివైజ్‌ను బనియన్‌లో కుట్టిన ప్రత్యేక అరలో బిగించిన ముఠా.. అదే బనియన్‌లో భుజం వద్ద మైక్రోఫోన్‌ను అమర్చింది. పరీక్షలో హైటెక్ మాస్‌కాపీయింగ్ ఎలా చేయాలో వీరికి తర్ఫీదు ఇచ్చేందుకు మలక్‌పేట టీవీ టవర్ ప్రాంతంలో ఖాలేద్ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచింది.
బెంచి నంబర్ చెప్పాలి.. రెడీ రెడీ అనాలి
అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఎలా వ్యవహరించాలనే విషయంలో రమేశ్ ముఠా ప్రత్యేక సూచనలు చేసింది. అరగంట ముందే కేంద్రంలోకి వెళ్లి తాము ఏ బెంచీలో కూర్చున్నామనే విషయాన్ని మైక్రోఫోన్ ద్వారా కంట్రోల్‌రూంలోని తమ సహాయకుడికి చేరవేసేలా ప్రణాళిక రచించింది. ఉదాహరణకు కేంద్రంలో ఓ అభ్యర్థి నాలుగో వరుసలో ఉన్న బెెంచీలో కూర్చుంటే అతడికి ‘డి’ సిరీస్ ప్రశ్నపత్రం వచ్చిందని అర్థం. అదే విషయాన్ని సహాయకుడికి చేరవేస్తే అతడు ‘డి’ సిరీస్ సమాధానాలు చెబుతాడు. అలాగే సమాధానాలు రాసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేందుకు ‘రెడీ.. రెడీ’ అని మాత్రం చెప్పాలని ముఠా సూచించింది. మరోవైపు ప్రశ్నపత్రాన్ని వాట్సప్ ద్వారా లీక్ చేసేందుకు ఓ ఇన్విజిలేటర్‌ను మాట్లాడుకున్నట్లు ముఠా నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అతడు ఎవరనేది తాజాగా గుర్తించారు. టోలిచౌకీ ప్రాంతంలో నివసించే అలీ అనే ప్రిన్సిపల్ ఈ నిర్వాకానికి పాల్పడినట్లు వెల్లడైంది. అతడు వాట్సప్‌లో ప్రశ్నపత్రాలు పంపగానే రమేశ్ ముఠా చాట్ జీపీటీ ద్వారా సమాధానాలు సిద్ధం చేసి వాటిని పరీక్ష కేంద్రంలో ఉన్న తమ వారికి చెప్పింది. ఈ వ్యవహారంలో మరో 20 మంది వరకు ప్రమేయముందని గుర్తించిన సిట్ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమైంది. ఈ హైటెక్ కాపీయింగ్‌కు సహకరించినందుకు ఒక్కో అభ్యర్థి నుంచి రమేశ్ ముఠా రూ.20లక్షల నుంచి రూ.75లక్షల వరకు దండుకున్నట్లు సిట్ గుర్తించింది.
రమేశ్ చరిత్రపై ఆరా
పెద్దపల్లి జిల్లా విద్యుత్తుశాఖలో పనిచేస్తున్న డీఈఈ రమేశ్ ఈ హైటెక్ కాపీయింగ్‌కు ఆద్యుడు కావడంతో అతడి చరిత్రపై సిట్ ఆరా తీస్తోంది. మూడేళ్ల క్రితం ప్రమాదానికి గురైనప్పటినుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అతడు ఇంత భారీస్థాయిలో కాపీయింగ్‌కు పాల్పడటంతో గతంలో ఏమైనా ఇలాంటి దందాలు సాగించాడా అని తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. హైటెక్ కాపీయింగ్ గురించి ఈ ముఠా ఇంటర్నెట్‌లో శోధించి డివైజ్‌లను సమకూర్చుకున్నట్లు గుర్తించింది. అలాగే గతంలోనూ రమేశ్‌పై ఒకట్రెండు కేసులున్నట్లు తెలుస్తుండటంతో వాటి గురించి కూపీ లాగుతోంది. పూర్తి సమాచారం కోసం అతడిని అదుపులోకి తీసుకునేందుకు గురువారం కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు లీకేజీ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టయి జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న పూల రవికిషోర్, రాయపురం దివ్య, రాయపురం విక్రమ్, భరత్ నాయక్, పసికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధును సిట్ గురువారం కస్టడీలోకి తీసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఒక్క రైతును చూసినా వణుకే!
-
Covid: భవిష్యత్తులో కరోనాలాంటి మరో మహమ్మారి రావొచ్చు: ప్రముఖ చైనా వైరాలజిస్ట్
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్