యాత్రికులపై మంత్రి జోగి రమేష్‌ అనుచరుల దాష్టీకం

‘మేం ఎవరో తెలుసా? మా అన్న మంత్రి. జోగి రమేష్‌! ఆయన అనుచరులం.. మమ్మల్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తాం!

Published : 04 Jun 2023 03:35 IST

జాతీయ రహదారిపై  బస్సులు నిలిపి దౌర్జన్యం
మహిళల పట్ల అసభ్య ప్రవర్తన
విద్యార్థుల పేరుతో కేసులు లేకుండా పోలీసుల రాజీ
ఎమ్మెల్యే స్టిక్కర్ల కార్లతో హల్‌చల్‌

ఈనాడు, అమరావతి - ఇబ్రహీంపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘మేం ఎవరో తెలుసా? మా అన్న మంత్రి. జోగి రమేష్‌! ఆయన అనుచరులం.. మమ్మల్నే అడ్డుకుంటారా? మీ అంతు చూస్తాం! వస్తారుగా రండి.. మా అన్న అడ్డా ఇబ్రహీంపట్నం.. దాని మీదుగానే వెళ్తారుగా... ఎలా వెళ్తారో చూస్తాం..!’ ‘ఎవడ్రా.. మావాళ్ల మీద గొడవపడింది.. అంత దమ్ముందా? బస్సు పక్కన ఆపండి’ అంటూ కొందరు యువకులు యాత్రికులను భయభ్రాంతులకు గురిచేశారు. రెండు బస్సుల్లో ఉన్న మహిళలు, యువతుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులకు ఫోన్‌ చేస్తామంటే.. ఓ యువకుడిని కొట్టి ఫోన్‌ లాక్కున్నారు. దాదాపు గంటసేపు బస్సులను జాతీయరహదారిపై ఆపేశారు. బస్సులోని యాత్రికులు 100కు ఫోన్‌ చేయగా.. ఇబ్రహీంపట్నం పోలీసులు వచ్చి ఇరువర్గాలను స్టేషన్‌కు తీసుకెళ్లి కేసులు లేకుండా పంపేశారు. విద్యార్థులు కావడంతో వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాము ఫిర్యాదు చేయట్లేదని బాధితుల వద్ద లేఖ రాయించుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటన శనివారం వెలుగుచూసింది.

పల్నాడు జిల్లా ఫిరంగిపురం గ్రామస్థులు ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దర్శనానికి రెండు బస్సుల్లో వెళ్లారు. అదే ఆలయానికి రెండు కార్లలో ఇబ్రహీంపట్నానికి చెందిన యువకులు 8మంది వచ్చారు. రెండు కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఉన్నాయి. ఒక కారు నెంబరు ఏపీ 16ఎఫ్‌బీ3334. మరో తెలుపు వెర్నాకారుకు నంబరు లేదు. దేవాలయం వద్ద యాత్రికులలో ఉన్న మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కార్లలో పెద్ద శబ్దంతో పాటలు పెట్టారు. దీనిపై బస్సు డ్రైవర్‌ అభ్యంతరం పెట్టారు. పార్కింగ్‌ విషయంలోనూ డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. దీంతో ఆ యువకులు ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద జాతీయ రహదారిపై కాపుకాశారు. ఫిరంగిపురం బస్సులు రాగానే దాడికి దిగారు. దీంతో బస్సులోని వ్యక్తులు తిరగబడగా... వారిలో కొందరిని కొట్టారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ఎమ్మెల్యే స్టిక్కర్ల మాటేంటి?

పోలీసులు ఇరువర్గాలను తీసుకెళ్లగానే వైకాపా నేతలు రంగంలోకి దిగి, పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో పోలీసులు ఇరువర్గాలపై కేసులు నమోదుచేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనవసరంగా మహిళలపై కేసులు ఎందుకని భయపెట్టారు. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి రాజీ కుదిర్చి యాత్రికులతో లేఖ రాయించుకున్నారు. ఇదంతా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినవారు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో విషయం వెలుగుచూసింది. ఆ రెండు కార్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లు ఎలా వచ్చాయో కూడా పోలీసులు ఆరా తీయలేదు. పైగా ఘర్షణ జరుగుతున్న సమయంలోనే రెండు కార్ల నెంబరు ప్లేట్లు తొలగించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని