వివాదాస్పద స్థలంపై ఆధిపత్య పోరు

విశాఖపట్నంలో అత్యంత విలువైన ఓ వివాదాస్పద స్థలంలో ఆదివారం అర్ధరాత్రి వరకు కొందరు హల్‌చల్‌ చేయడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు.

Published : 05 Jun 2023 04:52 IST

అర్ధరాత్రి వరకు అల్లరిమూకల హల్‌చల్‌
అటువైపు తొంగి చూడని పోలీసులు

ఈనాడు-విశాఖపట్నం, న్యూస్‌టుడే-వేపగుంట: విశాఖపట్నంలో అత్యంత విలువైన ఓ వివాదాస్పద స్థలంలో ఆదివారం అర్ధరాత్రి వరకు కొందరు హల్‌చల్‌ చేయడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనలకు గురయ్యారు. జీవీఎంసీ 98వ వార్డు షిప్‌యార్డ్‌ లేఅవుట్‌ సర్వే నంబరు 164/1లోని వివాదాస్పద స్థలంలో ఓ వర్గం వారు సిమెంటు స్తంభాలు పాతారు. విషయం తెలుసుకున్న కొందరు యువకులు బృందాలుగా వచ్చి అక్కడ పాతిన స్తంభాలు తీసేసి, విద్యుత్తు దీపాలను పగలగొట్టి, అక్కడే ఉన్న జనరేటర్‌కు నిప్పంటించారు. ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా.. పోలీసులు అటువైపు చూడలేదు. ఇదే స్థలంలో మే 31 అర్ధరాత్రి మంత్రి అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ అనుచరులమని చెప్పుకొంటూ కొందరు బీభత్సం సృష్టించారు. ఉదయం నుంచి ఇంత జరుగుతుండగా రాత్రి 11 తర్వాత రాత్రి రౌండ్స్‌కు వచ్చిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు వస్తున్నారని తెలిసి.. అక్కడివారంతా పరారయ్యారు.

ఇరువర్గాల మధ్య వాగ్వాదం: కొద్దిరోజులుగా ఆ స్థలం వద్ద రెండువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. స్థల వివాదం కోర్టులో ఉన్నా.. ఆదివారం ఉదయాన్నే ఇరువర్గాల వారు తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఓ వర్గం వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు టెంట్‌ ఏర్పాటు చేసుకుని కూర్చున్నారు. పొక్లెయిన్‌ తీసుకొచ్చి స్థలాన్ని చదును చేసేందుకు యత్నించగా.. మరో వర్గం అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. సాయంత్రం 4 గంటలకు ఓ వర్గంవారు పెద్దసంఖ్యలో స్థలం వద్దకు చేరుకుని ఇతరులను అడ్డుకున్నారు.

* రాత్రి 10.30కు మరోవర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికొచ్చి పాతిన స్తంభాలను తొలగించి అక్కడున్న వారిని చెదరగొట్టారు. ఈ ఘటనపై కాలనీవాసులు ఆందోళన చెందుతూ, స్థలవివాదం తేల వరకూ ఎవరూ అక్కడకు రాకుండా పోలీస్‌ పికెట్‌ ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ఘర్షణపై పెందుర్తి సీఐ గొలగాని అప్పారావు వివరణ కోరగా.. తమకు ఫిర్యాదు ఏమీ అందలేదని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు