హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలు కొన్నట్టు బహిర్గతమైంది.

Updated : 06 Jun 2023 06:09 IST

ఈనాడు, హైదరాబాద్‌, కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలు కొన్నట్టు బహిర్గతమైంది. ఇందులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉన్నట్టు నగర సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తన కుమార్తె ఏఈఈ పరీక్ష కోసం హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ సూత్రధారి ఏఈ రమేశ్‌ సహకారం తీసుకున్నట్టు నిర్ధారించారు. వివరాల్లోకి వెళ్తే.. పూల రమేశ్‌(47) స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా బీరంగి కొత్తకోట. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో నీటిపారుదల శాఖలో(ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌) అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. సైదాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతడి ద్వారా 70 మందికిపైగా ఏఈ ప్రశ్నపత్రాలు చేతులు మారాయి. మలక్‌పేట్‌ కేంద్రంగా 8 మంది సహాయకులతో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేసి ఏఈఈ, డీఏవో పరీక్షకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు సమాధానాలు చేరవేశాడు. పోలీసులు ఆయన్ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. విచారణలో నిందితుడు తాను ప్రజాప్రతినిధితో ఒప్పందం చేసుకున్నట్టు అంగీకరించాడు.  

రూ.75 లక్షలకు ఒప్పందం..!

కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శ్రీలత భర్త శ్రీనివాస్‌కు ఏఈ రమేశ్‌తో పరిచయం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఆయన కుమార్తె కోసం రమేశ్‌ను కలిశాడు. ఏఈఈ పరీక్షకు సహకరిస్తే రూ.75 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉద్యోగం వచ్చాకే డబ్బులిస్తానని షరతు విధించాడు. ఈ మేరకు ఫిబ్రవరి 26న శ్రీనివాస్‌ కూతురుతో పరీక్షను రాయించాడు. గుట్టుగా సాగిన వ్యవహారం బయటకు రాగానే మాజీ ఎంపీటీసీ దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు సమాచారం. సోమవారం సిట్‌ పోలీసులు బొమ్మకల్‌లోని వారి నివాసానికి వెళ్లి తనిఖీలు చేసి కొన్నిపత్రాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఏఈ రమేశ్‌కు సహకరించిన టోలిచౌకి ప్రాంతానికి చెందిన ప్రిన్సిపల్‌ అలీ పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు