నదిలో దిగి నలుగురి మృత్యువాత

సరదాగా కృష్ణానదికి వెళ్లిన నలుగురు బాలలు నీట మునిగి మృత్యువాతపడ్డ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మంగపేట గ్రామ శివారులో జరిగింది.

Published : 06 Jun 2023 04:04 IST

అంతా 15 నుంచి 18 ఏళ్లలోపు వారే

ఇటిక్యాల, న్యూస్‌టుడే: సరదాగా కృష్ణానదికి వెళ్లిన నలుగురు బాలలు నీట మునిగి మృత్యువాతపడ్డ విషాద ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మంగపేట గ్రామ శివారులో జరిగింది. మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన మున్నా, ఇస్మాయిల్‌, ఇబ్రహీం అన్నదమ్ములు. వీరు బతుకుదెరువు కోసం కర్నూలుకు వలస వెళ్లి అక్కడే జీవనం సాగిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో వీరి పిల్లలు మానవపాడు మండలం బోరవల్లిలోని మామ మాసుం ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. సోమవారం వీరితోపాటు మాసుం పిల్లలు కలిసి మొత్తం పది మంది ఆటోలో ఇటిక్యాల మండలంలోని మంగపేట(కనుమరుగైన గ్రామం) శివారులో కృష్ణానది వద్దకు వెళ్లారు. మాసుం కుమారుడు ఇమాం నీటి లోపలికి వెళ్లొద్దని అందరినీ హెచ్చరించి నదిలోకి దిగి అవతలి ఒడ్డు వైపు ఈదుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో ఇస్మాయిల్‌ కుమారులు సమీర్‌(18), రిహాన్‌(15), ఇబ్రహీం కుమార్తెలు అఫ్రీన్‌(17), నౌషీన్‌(15) నదిలో ఆటలాడుకుంటూ లోతట్టు ప్రాంతానికి వెళ్లి నీటమునిగారు. అవతలి ఒడ్డున ఉన్న ఇమాం వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నలుగురికి ఈత రాకపోవడం, వారిని రక్షించేందుకు కనుచూపు మేరలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసి బాధిత కుటుంబసభ్యులు, ఇటిక్యాల, కోదండాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. అన్నదమ్ముల పిల్లలు నలుగురు మృత్యువాతపడటంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటస్వామి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని