ఇసుక రేవు గుంతల్లో పడి వంటకూలీ మృతి

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని స్వర్ణముఖి నది ఇసుక గుంతలు ఓ వ్యక్తిని బలితీసుకున్నాయి. మెట్టు గ్రామ సమీపంలోని ఇసుక రేవు వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడి ముత్యాలయ్య(42) అనే వ్యక్తి మృతి చెందారు.

Published : 07 Jun 2023 03:41 IST

తిరుపతి జిల్లాలో ఘటన
తవ్వకాలపై గ్రామస్థుల ఆందోళన

చిట్టమూరు(కోట), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని స్వర్ణముఖి నది ఇసుక గుంతలు ఓ వ్యక్తిని బలితీసుకున్నాయి. మెట్టు గ్రామ సమీపంలోని ఇసుక రేవు వద్ద ప్రమాదవశాత్తు నీటిలో పడి ముత్యాలయ్య(42) అనే వ్యక్తి మృతి చెందారు. కోట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి ఉన్నారు. వంట కూలీగా ఉపాధి పొందే ముత్యాలయ్య.. చిట్టమూరులో పనులు ముగించుకుని సోమవారం రాత్రి మెట్టు వరకు బస్సులో వచ్చారు. ఇసుక రేవు మీదుగా తన గ్రామానికి కాలినడకన వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఇసుక గుంతలో పడిపోయారు. మంగళవారం ఉదయం కొందరు రేవులో శవాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతి విషయం తెలిసి ఇసుక రేవులో పనిచేసే సిబ్బంది యంత్రాలతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా లోతుగా తవ్వకాలు చేయడంతోనే ముత్యాలయ్య అందులో పడి మృతి చెందాడని.. అధికారులు, గుత్తేదారులే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. మెట్టు - గునపాడు మార్గంలో వాహనాలను అడ్డుకున్నారు. ఇసుకరేవు తవ్వకాల అనుమతిని రద్దు చేయాలని డిమాండు చేస్తూ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తీసుకెళ్లనీయకుండా తహసీల్దారు, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పాఠశాలలు ప్రారంభమైతే తమ పిల్లలందరూ మెట్టు పాఠశాలకు ఈ మార్గంలోనే వెళ్లాలని.. వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు, పెద్దలు ఇసుక గుత్తేదారు, అధికారులతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిట్టమూరు ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని నాయుడుపేటకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని