భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత

డార్క్‌నెట్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తెలిపింది.

Updated : 07 Jun 2023 05:54 IST

అంతర్జాతీయ మార్కెట్‌లో విలువ రూ.10 కోట్లు

దిల్లీ: డార్క్‌నెట్‌ ఆధారంగా దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఓ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించినట్లు నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) తెలిపింది. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను (15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌) స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒకే ఆపరేషన్‌లో ఈ స్థాయిలో ఎల్‌ఎస్‌డీని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన రెండు కేసుల్లో మొత్తం ఆరుగురిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. ‘ఈ భారీ నెట్‌వర్క్‌ దేశ, విదేశాల్లో విస్తరించి ఉంది. పోలండ్‌, నెదర్లాండ్స్‌, అమెరికాల నుంచి ఎల్‌ఎస్‌డీని అక్రమంగా దిగుమతి చేసుకొని.. దిల్లీ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సరఫరా చేస్తున్నారు. చెల్లింపుల కోసం డార్క్‌నెట్‌లో క్రిప్టో కరెన్సీలను ఉపయోగించారు. నిందితుల వద్ద నుంచి రూ.4.60 లక్షల విలువైన 2.2 కిలోల గంజాయినీ స్వాధీనం చేసుకున్నాం. బ్యాంకు ఖాతాల్లో రూ.20 లక్షలు ఉన్నట్లు గుర్తించాం’అని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఉత్తర విభాగం) జ్ఞానేశ్వర్‌ సింగ్‌ తెలిపారు.

అసలు ఏమిటీ ఎల్‌ఎస్‌డీ?

ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైథైలామైడ్‌).. రసాయనాల ఆధారిత డ్రగ్‌.  ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువగా యువత దీనికి బానిసలవుతున్నారు. దీని వాణిజ్య పరిమాణం 0.1 గ్రాములు. ఈ మొత్తాన్ని కలిగి ఉన్నా.. ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదవుతుంది.  తాజా దాడిలో పట్టుబడిన 15 వేల ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లు.. దాని వాణిజ్య పరిమాణం కంటే 2,500 రెట్లు ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని