మాస్‌ కాపీయింగ్‌ సూత్రదారి ఏఈ రమేశ్‌ లీలలెన్నో!

టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌తో సంచలనం రేకెత్తించిన నిందితుడు ఏఈ పూల రమేశ్‌కుమార్‌ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి.

Updated : 07 Jun 2023 05:42 IST

విచారణలో నేరచరిత్ర వెలుగులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌తో సంచలనం రేకెత్తించిన నిందితుడు ఏఈ పూల రమేశ్‌కుమార్‌ లీలలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. కీలక వివరాలు రాబట్టేందుకు ఇతడిని సిట్‌ పోలీసులు ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం మూడ్రోజుల కస్టడీ ముగిసింది. ఇప్పటివరకూ అతడి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు. సాంకేతిక పరిజ్ఞానంపై అపారమైన పట్టున్న రమేశ్‌ గతంలోనూ మాస్‌కాపీయింగ్‌లో సహకరించి ఉండొచ్చనే అంచనాకు వచ్చారు. పోలీసు విచారణలో అతడి గత నేరచరిత్ర కూడా వెలుగు చూసింది.

పూల రమేశ్‌కుమార్‌ స్వస్థలం ఏపీలోని అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట. అక్కడే ఉన్నత విద్య పూర్తిచేశాడు. చదువులో టాపర్‌గా ఉండే ఇతడు 2011లో మెరిట్‌ జాబితాలోనే నీటిపారుదలశాఖలో ఏఈ ఉద్యోగం సంపాదించాడు. అదే సమయంలో ఏఈ కొలువు సంపాదించిన యువతితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె వరంగల్‌ జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నాలుగైదేళ్లు సజావుగానే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. 2015లో బి.కొత్తకోట ఠాణా పరిధిలో ఒక మహిళ హత్యకేసులో రమేశ్‌ అరెస్టై జైలుకెళ్లాడు. ఆ తరువాత ఉద్యోగం నుంచి తొలగించడంతో ఖాళీగా ఉన్నాడు. ఆ సమయంలో సంపాదన కోసం తప్పటడుగులు వేసినట్టు తెలుస్తోంది. 2018లో తిరిగి ఉద్యోగంలోకి చేర్చుకున్నారు. కేవలం 8 నెలలు మాత్రమే ఉద్యోగంలో కొనసాగాడు. ఆ తరువాత ప్రభుత్వ కొలువు వదిలేసి ఇతర వ్యాపకాలలో మునిగిపోయాడు. కరీంనగర్‌లో కొంతకాలం పనిచేయడంతో అక్కడి వారితో పరిచయాలున్నాయి. ప్రస్తుతం హత్యకేసు న్యాయస్థానంలో ట్రయల్‌ నడుస్తోంది. టీఎస్‌పీఎస్సీ పరీక్షల నోటిఫికేషన్‌ వెలువడ్డాక హైటెక్‌ మాస్‌ కాపీయింగ్‌ వైపు దృష్టిసారించాడు. పాత పరిచయాలను వాడుకుని సురేష్‌ ద్వారా ప్రశ్నపత్రాలు సేకరించి 78 మందికి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నగర సిట్‌ పోలీసులు ఏఈఈ, డీఏఓ పరీక్షల్లో టాపర్ల వివరాలు సేకరిస్తున్న సమయంలో రమేశ్‌ అక్రమాల బాగోతం వెలుగు చూసింది. కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నపుడు ఈ అక్రమాలు బయటపడ్డాయి.

కళాశాల ప్రిన్సిపల్‌కు రూ.8 లక్షలు...

రమేశ్‌ హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో ఏడుగురు అభ్యర్థులకు సహకరించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల వరకూ తీసుకున్నాడు. ఈ వ్యవహారంలో సహకరించిన టోలిచౌకి కళాశాల ప్రిన్సిపల్‌ పేరు అలీ అని మొదట్లో చెప్పినా తరువాత అతని అసలు పేరు మహ్మద్‌పాషా అని, అభ్యర్థుల నుంచి తన చేతికి అందిన సొమ్ములో రూ.8 లక్షలు పాషాకు ఇచ్చినట్టు విచారణలో తెలియజేసినట్లు సమాచారం. ఇతడి నుంచి రాబట్టిన వివరాలతో ఏడుగురు అభ్యర్థులు, ప్రిన్సిపల్‌, ఏఈ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన 78 మందిని సిట్‌ పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా పోలీసుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ జాబితాలో కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని