యూపీ కోర్టు ఆవరణలో గ్యాంగ్‌స్టర్‌ హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ గ్యాంగ్‌స్టర్‌ను మరో దుండగుడు కాల్చి చంపాడు.

Published : 08 Jun 2023 03:59 IST

న్యాయవాది దుస్తుల్లో వచ్చి కాల్పులు

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ కోర్టు ఆవరణలో పట్టపగలు అందరూ చూస్తుండగా ఓ గ్యాంగ్‌స్టర్‌ను మరో దుండగుడు కాల్చి చంపాడు. న్యాయవాది దుస్తుల్లో వచ్చి గ్యాంగ్‌స్టర్‌ సంజీవ్‌ మహేశ్వరి జీవా (48)పై కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. లఖ్‌నవూ సివిల్‌కోర్టు గది బయట బుధవారం జరిగిన ఈ ఘటన  కలకలం రేపింది. కాల్పుల అనంతరం నిందితుడు విజయ్‌ యాదవ్‌(24)ను అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు చెప్పారు. పశ్చిమ యూపీలో క్రిమినల్‌ గ్యాంగ్‌ నడుపుతున్న సంజీవ్‌ జీవా కాల్పుల అనంతరం నేలపై పడున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ కాల్పుల్లో పోలీస్‌ కానిస్టేబులుతోపాటు రెండేళ్ల బాలిక కూడా గాయపడగా.. వారిని సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. పలు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న జీవా లఖ్‌నవూ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్నాడు. ఓ కేసుకు సంబంధించి అతణ్ని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై విచారణకు సీఎం యోగి ముగ్గురు సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేశారు.

జీవాపై 26 కేసులు

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అయిన సంజీవ్‌ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్‌ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. 1997లో జరిగిన రాష్ట్ర మంత్రి బ్రహ్మదత్‌ ద్వివేది హత్యకేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా.. సహ నిందితుడిగా జీవాపై కేసు నమోదైంది. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ హత్యకేసులోనూ నిందితుడైన జీవాపై మరో 24 ఇతర కేసులు ఉన్నాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు