సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌పై తెనాలి యువకుడిపై కేసు

సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెనాలికి చెందిన ఐటీడీపీ కార్యకర్త వేమూరి మదన్‌పై కేసు నమోదైంది.

Published : 08 Jun 2023 04:36 IST

అతడి తండ్రికి నోటీసు అందించిన పులివెందుల పోలీసులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తెనాలికి చెందిన ఐటీడీపీ కార్యకర్త వేమూరి మదన్‌పై కేసు నమోదైంది. దాంతో పులివెందుల పోలీసులు బుధవారం తెనాలి వచ్చారు. సివిల్‌ దుస్తుల్లో ఉన్న ఎస్సై హుస్సేన్‌, ఇతర సిబ్బంది పట్టణంలోని ఐతానగర్‌లో ఉంటున్న మదన్‌ ఇంటికి ఉదయం 10గంటలకు చేరుకున్నారు. అతను ఇంట్లో లేకపోవడంతో ఎక్కడకు వెళ్లాడని కుటుంబ సభ్యులను ఆరా తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న తెదేపా నాయకులు, న్యాయవాదులు కాకుమాను కనకరాంబాబు, జెట్టి రేణుకలతో పాటు పలువురు మద్దతుదారులు అక్కడకు చేరుకున్నారు. అతడిపై ఏ కేసు నమోదైందని పోలీసులను అడిగారు. మరో వ్యక్తి పేరిట ఉన్న ఖాతా ద్వారా అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేశారని చెప్పడంతో...ఆ ఖాతా మదన్‌ది కాదు కదా? కేసు ఏ విధంగా నమోదు చేశారని ప్రశ్నించారు. విచారణలో తమకు అందిన ఆధారాలను న్యాయస్థానంలో అందిస్తామని, మీరు న్యాయస్థానం ద్వారా చట్టపరంగా వాటిని పొందవచ్చని పోలీసులు సమాధానమిచ్చారు. పిలిచినప్పుడు విచారణకు హాజరు కావాలంటూ మదన్‌ పేరిట ఉన్న 41(ఏ) నోటీసును అతని తండ్రి మధుకిరణ్‌కు అందించి 10.30 గంటలకు వెళ్లిపోయారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని