నిద్రిస్తున్న భర్తకు నిప్పు పెట్టిన భార్య

కుటుంబ కలహాలతో ఓ భార్య నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన సంఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో బుధవారం చోటు చేసుకుంది.

Published : 08 Jun 2023 04:40 IST

ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి

మదనపల్లె నేరవార్తలు, కురబలకోట, న్యూస్‌టుడే: కుటుంబ కలహాలతో ఓ భార్య నిద్రిస్తున్న భర్తపై పెట్రోలు పోసి నిప్పుపెట్టిన సంఘటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తెట్టు పంచాయతీ పూజారివాండ్లపల్లెకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు లక్ష్మయ్య కుమారుడు శ్రీధర్‌ (43) సైన్యంలో పనిచేసి రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగొచ్చారు. ఆయన 17 ఏళ్ల కిందట అదే గ్రామానికి చెందిన మమతను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి లక్కి (14), దీపక్‌ (13) పిల్లలు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో భార్యాభర్తలు గొడవపడేవారు. ఈ నేపథ్యంలో మమత నాలుగు రోజుల క్రితం అదే గ్రామంలో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మమత పెట్రోలు క్యానుతో మిద్దెపై నిద్రపోతున్న భర్త వద్దకు వెళ్లి ఆయన పక్కనే నిద్రిస్తున్న కుమారుణ్ని లేపి భర్తపై పెట్రోలు పోసి నిప్పు పెట్టింది. మంటల్లో చిక్కుకున్న శ్రీధర్‌ కేకలేయడంతో కింద ఇంట్లో ఉన్న ఆయన తల్లిదండ్రులు మంటలు అదుపుచేసి 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మమత పరారవుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శ్రీధర్‌ మద్యం తాగి వేధించేవాడని, దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు