Vizag: విశాఖ రైల్వే స్టేషన్‌లో 18 నెలల చిన్నారి కిడ్నాప్‌

భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు విడిచి వచ్చిన గర్భిణి అనుకోని కష్టంలో పడింది. 18 నెలల కుమారుడు విశాఖ రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌నకు గురవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

Updated : 09 Jun 2023 12:20 IST

భర్త వేధింపులతో ఇల్లు విడిచి వచ్చిన మహిళకు అనుకోని కష్టాలు

ఈనాడు, విశాఖపట్నం, న్యూస్‌టుడే, రైల్వేస్టేషన్‌: భర్త వేధింపుల నుంచి తప్పించుకునేందుకు ఇల్లు విడిచి వచ్చిన గర్భిణి అనుకోని కష్టంలో పడింది. 18 నెలల కుమారుడు విశాఖ రైల్వేస్టేషన్‌లో కిడ్నాప్‌నకు గురవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటన జరిగినా సాయంత్రం వరకూ పోలీసులు నిందితుల ఆచూకీ గుర్తించలేకపోయారు. ఈ ఉదంతంపై విశాఖ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాలివి.. కొంగరి  భవానీది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం కాప్రాయపల్లి. భర్త వేధింపుల నేపథ్యంలో బిడ్డని ఏమైనా చేస్తారేమోనని భయపడి ఇల్లు విడిచి వెళ్లిపోవాలని భావించి రైలెక్కింది. బుధవారం సాయంత్రం విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ప్లాట్‌ఫామ్‌పై రాత్రంతా ఉండిపోయింది. గురువారం తెల్లవారుజామున ఒడిశాకు చెందిన ఒక జంట ఆమెతో పరిచయం చేసుకొని మాటలు కలిపారు. తరువాత తన పక్కనే బిడ్డను పడుకోబెట్టుకున్న  ఆమె నిద్రలోకి జారుకుంది. కొంత సమయం తరవాత లేచి చూసేసరికి బిడ్డ కనిపించలేదు. ఒడిశా జంట కూడా కనిపించ లేదు. దీంతో స్టేషన్‌లోని జీఆర్పీ పోలీసుల్ని ఆమె ఆశ్రయించింది. హుటాహుటిన తనిఖీలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ సి.ఐ కోటేశ్వరరావు తెలిపారు. భవానీ ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని