Cybercrime: సైబర్‌ నేరాలపై సరికొత్త ‘అస్త్రం’

రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్‌ మోసాలను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

Updated : 09 Jun 2023 10:00 IST

తరచూ మోసాలకు పాల్పడుతున్న ఫోన్‌ నంబర్ల శాశ్వత బ్లాక్‌
ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న సైబర్‌ మోసాలను అడ్డుకునేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. అనుమానిత నంబర్లను గుర్తించి, వాటిని శాశ్వతంగా బ్లాక్‌ చేస్తోంది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ఈ నేరాలను అరికట్టాలంటే అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లోనూ కృషి చేయాల్సిందేనని భావిస్తున్న అధికారులు తాజాగా అమలు చేస్తున్న ఈ విధానం సత్ఫలితాన్ని ఇస్తోందని చెబుతున్నారు.

రాష్ట్రంలో గత నాలుగేళ్లలో సైబర్‌ నేరాలు ఆరు రెట్లు పెరిగాయి. 2019లో కేవలం 2,691 సైబర్‌ నేరాలు నమోదు కాగా 2022 నాటికి అవి 15,217కు చేరుకున్నాయి. ఇందులో 90 శాతంపైగా ఆర్థిక మోసాలే ఉన్నాయి.  దేశ విదేశాల్లో పెద్దసంఖ్యలో సైబర్‌ నేరాల ముఠాలు తయారయ్యాయి. వీరు రకరకాల పద్ధతుల్లో ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. వీరి మోసాలపై ఎన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా నేరాలు తగ్గడం లేదు. జరుగుతున్న మోసాలకు, సెల్‌ఫోన్‌కు ఏదో ఒక రూపంలో లింకు ఉంటోంది. ఫోన్‌ చేసి మాట్లాడడంగానీ, ఫోన్లో సందేశం పంపిగానీ, నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే అడ్డగోలుగా సిమ్‌కార్డులు అమ్మకుండా కట్టడి చేయాలని, తద్వారా సైబర్‌నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఎప్పడి నుంచో డిమాండ్‌ ఉంది. రకరకాల కారణాలతో అది ఆచరణకు నోచుకోవడంలేదు. దీంతో తెలంగాణ పోలీసులు మరో వినూత్న పద్ధతి ఎంచుకున్నారు.

సైబర్‌ నేరాలు అరికట్టేందుకు తెలంగాణ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (టీ4సీ) పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా వచ్చే ఫిర్యాదులను సమూలంగా పరిశీలిస్తున్నారు. నేరగాళ్ల ఫోన్‌ నంబర్లు, ఐపీ చిరునామాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. పదేపదే వస్తున్న నంబర్లను గుర్తించి ఓ జాబితా తయారు చేస్తున్నారు. దాన్ని ‘నేషనల్‌ సైబర్‌ క్రైమ్స్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్సీఆర్పీ)కి పంపుతున్నారు. ఈ నంబర్ల నుంచి ఫోన్లు చేసి, సందేశాలు పంపించి ఫలానా వ్యక్తులను మోసం చేశారు కాబట్టి వీటిని శాశ్వతంగంఆ బ్లాక్‌ చేయించమని ఎన్పీఆర్పీని కోరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 200 పైగా నంబర్లు ఇలా పంపారు. వాటిద్వారా మోసం జరిగిందని కేసు నమోదు చేశారు కాబట్టి, సంబంధిత నంబర్‌ను బ్లాక్‌ చేయాలని ఎన్సీఆర్పీ సంబంధింత సర్వీస్‌ ప్రొవైడర్‌కు లేఖ రాస్తోంది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ వంటి ప్రాంతంలో అయితే ఎవరికివారే వ్యక్తిగతంగా నేరాలు చేస్తుంటారు. ఇటువంటివారి నంబర్‌ బ్లాక్‌ చేయించగలిగితే మరో నంబర్‌ తీసుకొని మోసాలు మొదలుపెట్టడానికి కొంత సమయం పడుతుంది. పదేపదే సిమ్‌కార్డులు తీసుకోవడం కొంత కష్టం కావచ్చని... తద్వారా పూర్తిగా ఆగిపోకపోయినా మోసాలు నెమ్మదించే అవకాశమయినా ఉందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. సైబర్‌నేరాలు అడ్డుకునేందుకు తీసుకుంటున్న అనేక చర్యల్లో ఇది ప్రధానమైందని ఆయన వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని