Saroornagar Apsara Murder: రాయితో కొట్టిచంపి.. మ్యాన్‌హోల్‌లో పడేసి

అతడు ఆలయంలో పూజారి. భార్య, కూతురు ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నాడు.

Updated : 10 Jun 2023 15:38 IST

ప్రియురాలిని హతమార్చిన పూజారి
పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తెస్తోందని ఘాతుకం

శంషాబాద్‌, సరూర్‌నగర్‌ క్రైం, న్యూస్‌టుడే: అతడు ఆలయంలో పూజారి. భార్య, కూతురు ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు, హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో గోశాల నిర్వహిస్తున్నాడు. అతనికి ఓ యువతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఆమె గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చింది. విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను హతమార్చాడు. మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించి అరెస్ట్‌ చేశారు. శంషాబాద్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ కె.నారాయణరెడ్డి మీడియాకు శుక్రవారం వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అయ్యగారి వెంకటసాయికృష్ణ(36) కుటుంబం సరూర్‌నగర్‌ శ్రీవేంకటేశ్వర కాలనీలో స్థిరపడింది. ఎంబీఏ పూర్తి చేసిన అతడు గుత్తేదారుగానూ, స్థానిక బంగారు మైసమ్మ దేవాలయంలో పూజారిగానూ పనిచేస్తున్నాడు. 2010లో వివాహమైంది. భార్య, కూతురు ఉన్నారు. గతేడాది ఏప్రిల్‌లో చెన్నైకి చెందిన ఓ కుటుంబం ఇదే కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఆ కుటుంబ యజమాని కాశీలోని ఆలయంలో పనిచేస్తున్నారు. అతని భార్య ప్రైవేటు ఉద్యోగి. వారి కూతురు కురగంటి అప్సర(30) అవివాహితురాలు. చెన్నైలో ఉన్నప్పుడు కొన్ని సినిమాల్లో నటించింది. మోడలింగ్‌, సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌లో అవకాశాల కోసం అన్వేషణ ప్రారంభించింది. రోజూ బంగారు మైసమ్మ ఆలయానికి వెళ్లేది. అక్కడ వెంకటసాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. అప్సర తల్లి అరుణని అతడు అక్కా అని పిలుస్తూ.. వారి ఇంటికి వెళ్లివస్తుండేవాడు. శంషాబాద్‌ సమీపంలోని సుల్తాన్‌పల్లిలో వెంకటసాయికృష్ణ నిర్వహిస్తున్న గోశాలకు అతనితోపాటు అప్సర పలుమార్లు వెళ్లింది. ఆమెకు సినిమాల్లో అవకాశం ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని అతడు చెప్పాడు. ఈ క్రమంలో వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అతడికి పెళ్లయిందని.. భార్య, కూతురు ఉన్నారని తెలిసినా ఆమె బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. తననూ వివాహం చేసుకోమంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో అప్సర గర్భం దాల్చడంతో ప్రైవేటు ఆసుపత్రిలో గర్భస్రావం చేయించాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరింత ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవలు జరిగేవి. దీంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

ఈ నెల 3న కోయంబత్తూరు వెళ్దామని అప్సరను నమ్మించాడు. విమాన టికెట్లు కొనుగోలు చేశానని చెప్పాడు. నిజమేననుకున్న ఆమె లగేజీ సహా ప్రయాణానికి సిద్ధమైంది. అప్సర వ్యక్తిగత పనిపై కోయంబత్తూరు వెళ్తోందని.. ఆమెను శంషాబాద్‌ వద్ద దింపివస్తానంటూ ఆమె తల్లికి వెంకటసాయికృష్ణ చెప్పాడు. ఆరోజు రాత్రి 8.15 గంటలకు సాయికృష్ణ, అప్సర కారులో సరూర్‌నగర్‌ నుంచి బయల్దేరారు. రాత్రి 10 గంటలకు శంషాబాద్‌ మండలం రాళ్లగూడలోని ఒక హోటల్‌లో భోజనం చేశారు. రాత్రి 11 గంటలకు సుల్తాన్‌పల్లిలోని గోశాల వద్దకు వెళ్లారు. అక్కడ కొంతసేపు గడిపారు. గోశాలలో బెల్లం దంచే రాయిని ఆమె కంటబడకుండా అతడు కారులోకి చేర్చాడు. 4న తెల్లవారుజామున 3.50 సమయంలో గోశాల సమీపంలోని నర్కుడలో ఓ ఖాళీ వెంచర్‌ వద్దకు చేరారు. ఆమె నిద్రలోకి జారుకోగానే కారు సీటు కవర్‌ను ఆమె ముఖంపై అదిమి ఊపిరాడకుండా చేశాడు. బెల్లం దంచే రాయితో తల వెనుక భాగంలో పదిసార్లు బలంగా బాదాడు. దీంతో ఆమె మరణించింది. మృతదేహంపై కారు కవర్‌ కప్పాడు. అక్కడి నుంచి సరూర్‌నగర్‌లోని తన ఇంటికి చేరుకుని.. అక్కడే మృతదేహం ఉన్న కారును పార్కు చేశాడు. ఏమీ తెలియనట్టుగా తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాడు.

భద్రాచలం వెళ్లిందంటూ అబద్ధం

కోయంబత్తూరు వెళ్తానన్న అప్సర ఫోన్‌ ఎత్తకపోవడంతో వెంకటసాయికృష్ణను ఆమె గురించి తల్లి అరుణ వాకబు చేశారు. శంషాబాద్‌ చేరాక ఆమె మనసు మార్చుకొని మిత్రులతో కలసి భద్రాచలం వెళ్లిందంటూ చెప్పాడు. అప్సర అదృశ్యమైనట్లు వారిద్దరూ ఈ నెల 5న శంషాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల పాటు కారులో ఉన్న అప్సర మృతదేహాన్ని ఈ నెల 7న కవర్‌లో చుట్టి సరూర్‌నగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయ సమీపంలోని మ్యాన్‌హోల్‌లో పడేశాడు. దుర్వాసన వస్తోందంటూ ఎల్బీనగర్‌ నుంచి అడ్డా కూలీలను పిలిపించాడు. రెండు ట్రక్కుల మట్టిని తీసుకొచ్చి మ్యాన్‌హోల్‌ను కప్పి సిమెంట్‌తో పూడ్పించాడు.

ఇలా దొరికాడు...

పోలీసుల ఎదుట వెంకటసాయికృష్ణ తనకేమీ తెలియదన్నట్టుగా నటించాడు. అప్సర తన స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్లిందని చెప్పాడు. ఆమె బస్సు ఎక్కినట్లు అతడు చెప్పిన శంషాబాద్‌లోని అంబేడ్కర్‌ కూడలి వద్ద సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించినపుడు అసలు విషయం వెలుగుచూసింది. ఆమె బస్సు ఎక్కలేదని తేలింది. ఇద్దరూ కలిసి కారులో సుల్తాన్‌పల్లి వెళ్లినట్లు గుర్తించారు. అప్సర భద్రాచలం వెళ్లిందని చెప్పిన సమయంలో ఇద్దరి సెల్‌ఫోన్లు ఒకేచోట ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించటంతో వాస్తవం వెలుగుచూసింది. పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి తేవడం, వివాహేతర సంబంధం విషయం బయటపడితే పరువు పోతుందనే భయంతోనే అప్సరను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని డీసీపీ తెలిపారు. అతడిని కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం సేకరిస్తామన్నారు.  సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ సమక్షంలో పంచనామా చేసి.. అప్సర మృతదేహాన్ని జేసీబీ సాయంతో వెలికితీశారు. శవపరీక్ష కోసం ఉస్మానియా శవాగారానికి తరలించారు. తన బిడ్డను మాయమాటలతో మోసగించిన నిందితుడికి కఠిన శిక్ష పడాలని అప్సర తల్లి అరుణ అన్నారు. అతడు తనను అక్కా అని పిలుస్తుండేవాడని.. ఇంటికి వచ్చి భోజనం చేసేవాడని, స్నేహంగా మెలిగేవాడని తెలిపారు. ఇంతటి దారుణానికి ఒడిగడతాడని కలలోనూ అనుకోలేదని రోదించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని