ఇంటి బయటకు పిలిచి కాల్చి చంపారు!

హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో శుక్రవారం మరో ఘోరం జరిగింది. భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చిన దుండగులు తనిఖీల పేరుతో ఇంట్లో ఉన్న వారిని బయటకు పిలిచి కాల్చి చంపారు.

Published : 10 Jun 2023 03:57 IST

భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చి దుండగుల ఘాతుకం
మణిపుర్‌లో ముగ్గురి మృతి

ఇంఫాల్‌: హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న మణిపుర్‌లో శుక్రవారం మరో ఘోరం జరిగింది. భద్రతా సిబ్బంది దుస్తుల్లో వచ్చిన దుండగులు తనిఖీల పేరుతో ఇంట్లో ఉన్న వారిని బయటకు పిలిచి కాల్చి చంపారు. కంగ్‌పోకపీ, ఇంఫాల్‌ పశ్చిమ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఖొకెన్‌ గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తూటా గాయాలతో ముగ్గురు పౌరులు మృతి చెందారు. కాల్పుల శబ్దం విని పహారా విధుల్లో ఉన్న అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి రాగా దుండగులు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు మణిపుర్‌ పోలీస్‌, అస్సాం రైఫిల్స్‌, ఆర్మీ సిబ్బంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాయుధ దుండగులు మైతేయి సముదాయానికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. మణిపుర్‌ రాష్ట్రంలో గత నెల 3 నుంచి దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. హింసాత్మక ఘటనలు, దోపిడీలు, ఆస్తుల విధ్వంసం వెనుకున్న కుట్రను బహిర్గతం చేయడానికి 10 మంది సభ్యులతో కూడిన సిట్‌ను సీబీఐ ఏర్పాటు చేసింది. డీఐజీ హోదా అధికారి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి నేతృత్వం వహిస్తున్నారు. ఆరు కేసులను సీబీఐకి మణిపుర్‌ ప్రభుత్వం అప్పగించింది. సీబీఐకి కేసులు బదిలీ చేయనున్నట్లు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటించారు.  హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు సుమారు 100 మంది చనిపోగా 300 మందికిపైగా గాయపడ్డారు.

అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరణ

మణిపుర్‌లో పదే పదే ఇంటర్నెట్‌, మొబైల్‌ సేవలను నిలిపివేయటాన్ని ప్రశ్నిస్తూ ఇద్దరు పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఈ తరహా పిటిషన్‌...హైకోర్టు ముందు ఉన్నందున సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరపాల్సిన అవసరమేమిటని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ రాజేశ్‌ బిందల్‌ ధర్మాసనం ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని