కుక్కలకు ఆహారంగా ‘ఆమె’ శరీర భాగాలు!

మహారాష్ట్రలోని ఠాణెలో వెలుగుచూసిన మహిళ దారుణహత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. సరస్వతి వైద్య (36) మృతదేహ భాగాలను నిందితుడు మనోజ్‌ సానె (56) కుక్కలకు ఆహారంగా వేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 10 Jun 2023 07:17 IST

ఠాణె హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి..
సరస్వతిది ఆత్మహత్య అంటున్న నిందితుడు

ముంబయి: మహారాష్ట్రలోని ఠాణెలో వెలుగుచూసిన మహిళ దారుణహత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. సరస్వతి వైద్య (36) మృతదేహ భాగాలను నిందితుడు మనోజ్‌ సానె (56) కుక్కలకు ఆహారంగా వేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టారని పోలీసులు శుక్రవారం తెలిపారు. సరస్వతికి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారని, వారి వాంగ్మూలం నమోదు చేశామన్నారు. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తయ్యాక మృతురాలి దేహ అవశేషాలను తోబుట్టువులకు అందజేస్తామని డీసీపీ జయంత్‌ బజ్‌బలే చెప్పారు. మరోవైపు.. సరస్వతిని తాను చంపలేదని, ఆమె విషం తాగి ఆత్మహత్య చేసుకొందని నిందితుడు మనోజ్‌ చెబుతున్నాడు. హెచ్‌ఐవీ పాజిటివ్‌తో బాధపడుతున్న తనకు ఆమెతో శారీరక సంబంధాలు లేవని, సరస్వతి తన కుమార్తెతో సమానమనీ అంటున్నాడు. జూన్‌ 3న తాను బయటి నుంచి ఇంటికి వచ్చేసరికి ఆమె ఆత్మహత్య చేసుకొని ఉందని, కేసులో ఇరుక్కుంటానన్న భయంతో మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నానని తెలిపాడు.

శ్రద్ధావాకర్‌ హత్య తరహాలో..

దిల్లీలో జరిగిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిని శ్రద్ధావాకర్‌ హత్య తరహాలో మృతదేహాన్ని ముక్కలు చేశానని, ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఇది విచారణను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కూడా కావచ్చని, ఏ విషయం దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత కొద్దిరోజులుగా నిందితుడు కుక్కలకు తరచూ ఆహారం పెడుతున్నాడని స్థానికులు చెబుతున్నట్లు తెలిపారు. ఆ శునకాలకు ఆమె శరీర భాగాలనే పెట్టాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.  మనోజ్‌ పడకగదిలో శరీర భాగాలున్న పెద్ద ప్లాస్టిక్‌ సంచులు, రక్తమోడుతున్న చెట్లు నరికే యంత్రాన్ని నయానగర్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించారు. ప్రస్తుతానికి నిందితుడిపై హత్య, ఆధారాల ధ్వంసం సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు చెప్పారు. మనోజ్‌ను న్యాయస్థానంలో హాజరుపరచగా, జూన్‌ 16 వరకు పోలీసు కస్టడీకి జడ్జి ఆదేశించారు.

* ఐటీఐలో శిక్షణ పొందిన మనోజ్‌ సరైన ఉద్యోగం దొరక్క గత పదేళ్లుగా రేషన్‌ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే సరస్వతితో పరిచయం ఏర్పడి, ఆమెకు సేల్స్‌ పర్సన్‌గా ఉద్యోగం ఇప్పించాడు. 2014 నుంచి సాన్నిహిత్యం పెరిగి, 2016 నుంచి ఇద్దరూ కలిసి ఉండటం ప్రారంభించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు