అతి వేగం ఖరీదు.. 9 ప్రాణాలు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నాలుగు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. ఏకంగా తొమ్మిది నిండు ప్రాణాలను గాలిలో కలిపేశాయి. ఈ ప్రమాదాలన్నిటికీ మితిమీరిన వేగమే కారణం.

Updated : 10 Jun 2023 06:25 IST

వేర్వేరు చోట్ల నాలుగు దుర్ఘటనలు
ఖమ్మం జిల్లాలో తండ్రి, కుమార్తె, మనుమరాలు..
హనుమకొండ జిల్లాలో అన్నాచెల్లెళ్లు..
మహబూబాబాద్‌ జిల్లాలో కొత్త జంట దుర్మరణం

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నాలుగు ప్రమాదాలు విషాదాన్ని మిగిల్చాయి. ఏకంగా తొమ్మిది నిండు ప్రాణాలను గాలిలో కలిపేశాయి. ఈ ప్రమాదాలన్నిటికీ మితిమీరిన వేగమే కారణం. నాలుగేళ్ల బాలుడికి అక్షరాభ్యాసం చేయించుకుని.. సంతోషంతో తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబం రోడ్డు ప్రమాదంతో అతలాకుతలమైంది. తండ్రి, కుమార్తె, ఏడాదిన్నర వయసున్న మనుమరాలు విగతజీవులుగా మారడం తీవ్ర విషాదం నింపింది. మరో ప్రమాదంలో.. హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్న అన్నాచెల్లెళ్లు లారీని ఢీకొట్టి సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. తండ్రి లేని ఆ పిల్లలను పెంచి పెద్ద చేసిన తల్లి.. తన ఆశలన్నీ అడియాసలయ్యాయని గుండెలవిసేలా రోదిస్తోంది. ఇంకో దుర్ఘటనలో.. బైక్‌పై వెళ్తున్న కొత్తజంటను లారీ ఢీకొట్టడంతో వారిద్దరూ అసువులు బాశారు. పెళ్లయిన మూడు నెలలకే వారికి నూరేళ్లు నిండిపోయాయని కుటుంబసభ్యులు కుమిలిపోతున్నారు. నాలుగో ప్రమాదానికి.. యువకుడి నిర్లక్ష్యం కారణమైంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అతడు ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో అతడితో పాటు ఒక మహిళ మృతి చెందింది.


వైరా, తల్లాడ, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్టేజిపినపాక వద్ద శుక్రవారం లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందారు. కల్లూరు మండలం వాచ్యానాయక్‌తండాకు చెందిన దంతవైద్యుడు బాణోత్‌ నవీన్‌ తన కుటుంబంతోపాటు అత్తమామల కుటుంబ సభ్యులతో కలసి రెండు రోజుల కిందట బాసర వెళ్లారు. తన కుమారుడు కార్తికేయకు అక్షరాభ్యాసం చేయించి రైలులో గురువారం అర్ధరాత్రి ఖమ్మం చేరుకుని బంధువుల ఇంట్లో బస చేశారు. శుక్రవారం ఉదయం నవీన్‌ తన బావమరిదితో కలిసి బస్సులో సొంతూరికి పయనమయ్యారు. ఇద్దరు చిన్నారులు సహా మిగిలిన ఎనిమిది మంది కుటుంబసభ్యులు మధ్యాహ్న సమయంలో కారులో బయల్దేరారు. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజిపినపాక గ్రామంలో వీరి కారు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో.. కారులో ఉన్న నవీన్‌ భార్య అంజలి (30), ఏడాదిన్నర పాప శ్రీవల్లి, కారు నడుపుతున్న అంజలి తండ్రి అజ్మీరా రాంబాబు (55) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన అయిదుగురిలో రాణి (50), స్వాతి (30) పరిస్థితి విషమంగా ఉండగా.. బాలుడు కార్తికేయ, బాబు, ప్రవీణ్‌లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. భార్యను, చిన్నారిని కోల్పోయిన నవీన్‌ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రెండు వాహనాలూ మితిమీరిన వేగంతో వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఎయిర్‌బెలూన్లు తెరుచుకున్నప్పటికీ ప్రమాద తీవ్రత దృష్ట్యా ఉపయోగం లేకుండా పోయింది. ఏసీపీ రహమాన్‌, సీఐ సురేశ్‌, ఎస్సైలు వీరప్రసాద్‌, సురేశ్‌ సహాయ చర్యలను పర్యవేక్షించారు.


మార్చి 9న పెళ్లి.. జూన్‌ 9న మృతి

మరిపెడ, న్యూస్‌టుడే: ఎన్నో కలలు.. మరెన్నో ఆశలతో దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన వారి జీవితం మూడు మాసాలకే ముగిసింది.. మార్చి నెలలో వారిద్దరూ దంపతులయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో నివసిస్తూ.. శుక్రవారం స్వస్థలానికి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మరిపెడకు చెందిన గోగునాథ్‌ అంజలి (21)కి, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన తునగర్‌ నారాయణ (23)తో మార్చి 9వ తేదీన వివాహం జరిగింది. నారాయణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నారు. దంపతులు హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కాపురం పెట్టారు. వారాంతపు సెలవులను అంజలి పుట్టింట్లో గడిపేందుకు ఇద్దరూ ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌ నుంచి మరిపెడకు పయనమయ్యారు. మరో 15 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. తానంచర్ల గ్రామ సమీపంలో ఎదురుగా అతి వేగంతో వస్తున్న లారీ.. వారి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. నారాయణ హెల్మెట్‌ తెచ్చుకున్నా.. దాన్ని వినియోగించలేదని పోలీసులు చెబుతున్నారు. ఆనందంగా వివాహం చేసి పంపిస్తే.. విగతజీవులయ్యారంటూ కుటుంబసభ్యులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. మరిపెడ ఎస్సై దూలం పవన్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


అందివచ్చిన పిల్లలు.. అందని లోకాలకు..

భీమారం, ధర్మసాగర్‌ న్యూస్‌టుడే: ఆమె 15 ఏళ్ల కిందట భర్తను కోల్పోయింది. ఎన్నో కష్టనష్టాలకోర్చి.. కుమారుడిని, కుమార్తెను పెంచింది. వారు ప్రయోజకులై సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు సాధించడంతో ఆమె మురిసిపోయింది. కానీ అంతలోనే ఆ తల్లి ఆశలను విధి చిదిమేసింది. తనను చూసేందుకు స్వగ్రామానికి వస్తున్న పిల్లలిద్దరినీ రోడ్డుప్రమాదం కబళించడంతో మాతృహృదయం ముక్కలైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం పెద్ద పెండ్యాల సమీపంలోని డీపీఎస్‌ తండా వద్ద శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..

హసన్‌పర్తి మండలం నాగారానికి చెందిన పొరెడ్డి దేవేందర్‌రెడ్డి, సుజాత దంపతులకు కుమారుడు సుమిత్‌రెడ్డి (23), కుమార్తె పూజితరెడ్డి (21) ఉన్నారు. దేవేందర్‌రెడ్డి గతంలోనే మృతి చెందగా.. సుజాత ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసింది. సుమిత్‌రెడ్డి బీటెక్‌ పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. పూజిత కూడా ఏడాది కిందటే బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగంలో చేరింది. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వస్తున్న వీరు డీపీఎస్‌ తండా వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఓ లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం లారీ వెనుక భాగంలోకి చొచ్చుకెళ్లడంతో వారు బైక్‌పైనే ప్రాణాలొదిలిన దృశ్యం గగుర్పాటు కలిగించింది. బంధువులు, గ్రామస్థులు సంఘటన స్థలంలో మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు.


అతడి నిర్లక్ష్యానికి మూల్యం

మహాముత్తారం, న్యూస్‌టుడే: యువకుడి అతివేగం అతడితో పాటు మరొకరి ప్రాణాన్ని బలిగొంది. కాటారం-మేడారం ప్రధాన రహదారిపై శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాటారం సీఐ రంజిత్‌రావ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని కొర్లకుంటకు చెందిన చేరాల అశోక్‌ (30) శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై మండల కేంద్రం నుంచి స్వగ్రామానికి వస్తున్నాడు. అతడికి ఎదురుగా.. గోదావరిఖని నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారానికి 15 మందితో బయలుదేరిన ట్రాలీ ఆటో వస్తోంది. కొర్లకుంట-దొబ్బలపాడు గ్రామాల మధ్య అశోక్‌ బైక్‌ను అతివేగంగా నడుపుతూ ఎదురుగా వస్తున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ట్రాలీ ముందుభాగంలో కూర్చున్న గోదావరిఖనికి చెందిన చిల్ల సమ్మక్క(55) తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ట్రాలీ ముందుభాగం, ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలోని మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ట్రాలీ అదుపుతప్పి ఢీకొట్టడంతో అటుగా వస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది. అశోక్‌ స్వగ్రామంలో క్షౌరశాలను నిర్వహిస్తుండేవాడు. ‘కుల వృత్తులకు ప్రభుత్వ సాయం’ పథకం కోసం దరఖాస్తు చేసేందుకు మహాముత్తారం వెళ్లాడు. అతడితోపాటు వాహనంపై వెళ్లిన అతని వదిన, మరో యువకుడు తిరుగు ప్రయాణంలో యామన్‌పల్లి వద్దే దిగిపోయారు. అశోక్‌ నిర్లక్ష్యంగా వాహనం నడుపుతుండడంతో భయపడ్డారు. చివరకు అతడు ప్రమాదంలో మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని