Vizag: విశాఖ ఎంపీ కుటుంబీకుల కిడ్నాప్‌

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైకాపా నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది.

Updated : 16 Jun 2023 16:47 IST

ఆడిటర్‌ జీవీ కూడా..
దాడి చేసి డబ్బు వసూలు
ఇద్దరు నిందితుల పట్టివేత

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్‌తో పాటు ఆడిటర్‌, వైకాపా నేత గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. కిడ్నాపర్లు రెండురోజుల పాటు  శరత్‌ ఇంట్లోనే ఉన్నారు. శరత్‌ను, జీవీని కొట్టి, ఒత్తిడి చేసి విలువైన వస్తువులతో పాటు, రూ.1.75 కోట్లు తీసుకున్నారు. పోలీసుల రాకను గుర్తించి పరారయ్యే క్రమంలో దొరికిపోయారు. బాధితులు ముగ్గురూ క్షేమంగా ఇంటికి చేరారు. ఈ ఘటనపై విశాఖ సీపీ త్రివిక్రమవర్మ గురువారం సాయంత్రం వివరాలు వెల్లడించారు. డబ్బు కోసమే నిందితులు కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, మరో అయిదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు.

ఫోన్‌ చేయించి రప్పించారు

‘ఎంపీ తన కుమారుడు శరత్‌కి రుషికొండలో ఒక ఇంటిని పెళ్లికానుకగా ఇచ్చారు. ముగ్గురు కిడ్నాపర్లు 13వ తేదీన ఆ ఇంట్లోకి వెళ్లారు. అప్పుడు ఇంట్లో శరత్‌ ఒక్కరే ఉన్నారు. ఆయనపై దాడిచేసి భయపెట్టారు. ఇల్లంతా వెతికి, ఆభరణాలు తీసుకున్నారు. ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నారు. అవసరమైన ఆహారం శరత్‌తో ఆర్డర్‌ పెట్టించారు. 14వ తేదీ ఉదయం తనకు ఆరోగ్యం బాగోలేదని శరత్‌తో ఆయన తల్లి జ్యోతికి ఫోన్‌ చేయించారు. ఉదయం 8గంటలకు వచ్చిన ఆమెవద్ద ఉన్న బంగారం సైతం లాగేసుకున్నారు. ఎంపీకి సన్నిహితంగా ఉండే జీవీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందని ఆలోచించి.. జ్యోతి, శరత్‌తో ఆయనకు ఫోన్‌ చేయించారు. అనుమానంగానే వెళ్లిన జీవీపై కిడ్నాపర్లు దాడికి పాల్పడ్డారు. ఓ ఖాతాకు దాదాపు రూ.75 లక్షలు ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. మరో రూ.కోటి నగదును తమ డ్రైవర్‌తో తెప్పించి, జీవీ వారికి ఇచ్చారు. పోలీసులు విచారణ చేస్తున్నారన్న అనుమానం రాగానే బందీలుగా ఉన్న ముగ్గురితో ఎంపీ కారులో పరారయ్యారు’ అని సీపీ వివరించారు.

‘జీవీ కిడ్నాప్‌ అయినట్లు అనుమానంగా ఉందని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ గురువారం ఉదయం 8 గంటలకు ఫోన్‌చేసి చెప్పారు. వెంటనే ఫోన్‌ ట్రాకింగ్‌ చేసి జీవీతో మాట్లాడగా ‘శ్రీకాకుళం నుంచి వస్తున్నా.. నాకేమీ ఇబ్బంది లేదు’ అని చెప్పారు. ఆయన మాటలకు, సాంకేతిక ఆధారాలకు పొంతన లేకపోవడంతో అనుమానం బలపడింది. డ్రైవర్‌ రూ.కోటి మొత్తాన్ని జీవీకి అందించినట్లు ఎంపీ చెప్పడంతో.. డబ్బు కోసమే కిడ్నాప్‌ జరిగిందని నిర్ధారించుకున్నాం. వెంటనే డీసీపీ-1, 2, క్రైం, టాస్క్‌ఫోర్సు బృందాలను అప్రమత్తం చేశాం. సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా రుషికొండ ప్రాంతానికి వెళ్లాం. 11 గంటల వరకు గాలించినా ఎక్కడ ఉన్నారో తెలియలేదు. కిడ్నాప్‌లకు పాల్పడే ఇద్దరిపై అనుమానం రాగా.. వారే అని నిర్ధారించుకున్నాం. అందులో ఒకరు రౌడీషీటర్‌ హేమంత్‌. ఆనందపురం నుంచి పద్మనాభం వైపు వాహనం వెళుతున్నట్లు సెల్‌సిగ్నల్‌ ఆధారంగా గుర్తించాం. ఈ క్రమంలో విజయనగరం ఎస్పీని కూడా అప్రమత్తం చేశాం. అప్పటికే పీఎంపాలెం వద్ద ఎంపీకి చెందిన నలుపు రంగు ఆడి కారును ఎస్‌ఐ గుర్తించి వెంబడించారు. వాహనం ఆనందపురం-బాకురుపాలెం రోడ్డులో వెళుతుండగా పద్మనాభం సీఐ అదే రోడ్డులో వ్యతిరేకదిశలో వచ్చారు. పోలీసుల వాహనాన్ని ఆడి కారు ఢీకొట్టి తుప్పల్లోకి వెళ్లిపోయింది. ఆడి కారులో ఉన్న ఇద్దరు కిడ్నాపర్లు పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు డీసీపీలు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. కిడ్నాప్‌ చేసినవారిని ఓ కూడలిలో వదిలేసినట్లు నిందితులు తెలిపారు. అక్కడకు కిడ్నాపర్లను తీసుకెళ్లి పరిశీలించగా... ఎంపీ కుటుంబసభ్యులు, జీవీ అప్పటికే ఆటోలో వెళ్లినట్లు స్థానికులు చెప్పారు’ అని సీపీ వివరించారు. అయితే, కారుతో ఢీకొట్టిన తరువాత... పోలీసుల నుంచి తప్పించుకున్న ఓ నిందితుడు బ్యాగుతో పరిగెత్తి జాతీయరహదారికి వెళ్లే మార్గం అడిగినట్లు స్థానికులు చెప్పారు.

డబ్బు కోసమే

‘ఇటీవల స్థల లావాదేవీలు జరగడంతో భారీగా డబ్బు ఉంటుందన్న ఆలోచనతోనే కిడ్నాపర్లు ఎంపీ కుమారుని ఇంట్లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ప్రధాన నిందితుడు కోలా వెంకట హేమంత్‌ కుమార్‌పై ఇప్పటికే రౌడీషీట్‌ ఉంది. ఇతనిపై 12 కేసులున్నాయి’ అని సీపీ తెలిపారు. కిడ్నాపర్లు హేమంత్‌, రాజేశ్‌లను అదుపులోకి తీసుకున్న తర్వాత సీపీ త్రివిక్రమవర్మ స్వయంగా విచారించారు. వీరితోపాటు మరో అయిదుగురు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. త్వరలో మిగిలినవారిని అదుపులోకి తీసుకుంటామన్నారు.

రియల్‌ ఎస్టేట్‌ గొడవ కాదు.. డబ్బుకు ఆశపడే

కిడ్నాప్‌ ఉదంతంపై సీపీ త్రివిక్రమవర్మ స్పందిస్తూ... ‘ఇది రియల్‌ ఎస్టేట్‌ గొడవ కాదు... కేవలం డబ్బుకు ఆశపడి చేసిన కిడ్నాప్‌’ అని పేర్కొన్నారు. విలేకర్లు ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. ‘హేమంత్‌పై రౌడీషీట్‌ ఉంది. రెండు, మూడు రోజులుగా పోలీసుస్టేషన్‌లో సంతకాలు పెట్టకపోతే ఎందుకు ఆరాతీయలేదు? వీఐపీలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఉండే ప్రాంతంలో సీసీ కెమెరాలుంటాయి. ఎంపీ ఇంట్లోకి ఓ రౌడీషీటరు వెళ్లి రెండు రోజులు తిరిగి రాకపోతే పోలీసులకు అనుమానం రాలేదా? నిత్యం సీసీటీవీ ఫుటేజీలను కమాండ్‌ కంట్రోల్‌ రూంలో పరిశీలిస్తారు. రౌడీషీటరు వెళ్లిన ఇంట్లోకే వైకాపా నేత జీవీ వెళ్లినా... ఆయన బయటకు రాకపోయినా ఎందుకు పట్టించుకోలేదు?’ అని ప్రశ్నించగా... ‘మీరడిగే వాటన్నింటికీ సమాధానాలు ఉన్నాయి. కేసు విచారణ ఇప్పుడే ప్రారంభమైంది. మళ్లీ సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తాం’ అని బదులిచ్చారు.

ప్రశ్న: హేమంత్‌కుమార్‌ అనే కిరాయి రౌడీకి, ఎంపీకి ఉన్న ఆర్థికపరమైన  సంబంధాలేంటి?

సీపీ: ఎలాంటి ఆర్థిక సంబంధాల్లేవు. ఎంపీ నిర్మాణపనుల్లో కాంట్రాక్టరు దగ్గర ఉండే ఉప గుత్తేదారు వద్ద పనిచేసి ఉంటారేమో. ఎంపీకి హేమంత్‌ ముఖం గానీ, పేరు గానీ తెలియదు.

మధురవాడలో ఐదెకరాల స్థలం వ్యవహారంలో హేమంత్‌కు కమీషన్‌ రావాలనే ఆరోపణలున్నాయి. ఇది సెటిల్‌మెంటా.. కిడ్నాపా?

సెటిల్‌మెంట్‌ ఎలా అవుతుంది? ఏముంది సెటిల్‌ చేసుకోవడానికి? ఇది కేవలం డబ్బు కోసం జరిగిన కిడ్నాప్‌గా తేల్చాం. రియల్‌ ఎస్టేట్‌ గొడవ కాదు. డబ్బుకు ఆశపడి చేశారు.

రెండు, మూడు రోజులుగా ఇంత జరుగుతున్నా పోలీసులకు సమాచారం రాకపోవడం, అక్కడున్న సెక్యూరిటీ సమాచారం ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సమాచారం ఎవరి నుంచి వచ్చింది?

మాకు ఎంపీ ఎంవీవీ గురువారం 8 గంటలకు ఇచ్చిన ఫిర్యాదుతోనే సమాచారం వచ్చింది. అంతకుముందు ఏమీ తెలియదు. ఎంపీ ఫోన్‌కు జీవీ స్పందించకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. జీవీ ముఖ్యమైన అధికారిక కార్యక్రమానికీ హాజరుకాలేదు. అందుకే అనుమానం వచ్చి ఫిర్యాదుచేశారు.

పోలీసులకు జీవీ పొంతనలేని సమాధానాలు ఎందుకు చెప్పారు?

ఫోన్‌లో కిడ్నాపర్లు అలా చెప్పించారండీ. ఏం చెప్పాలో చెప్పి మరీ బలవంతంగా మాట్లాడించారు. కిడ్నాప్‌ అయిన శరత్‌.. తన తల్లిని ఎందుకు ఇంటికి పిలిపిస్తారు?

కిడ్నాప్‌ అయిన సమయంలో ఇంట్లో సెక్యూరిటీ ఎవ్వరూ లేరా? సీసీ కెమెరాలు లేవా? అదే ఇంటికి సీఎం వచ్చి వెళ్లారు కదా?

ఇంట్లో ఇంకా సీసీ కెమెరాలు పెట్టలేదు. సెక్యూరిటీ ఎవరూ లేనట్టున్నారు. ఎంపీ అబ్బాయి ఒక్కరే ఉంటున్నారు. అక్కడ వంట కూడా చేసుకోవట్లేదు. రెగ్యులర్‌గా ఆ ఇంటికి వెళ్లి వస్తున్నారు.

మొత్తం డబ్బు, బంగారం స్వాధీనం   చేసుకున్నారా? శరత్‌, జీవీలకు ఏమైనా గాయాలున్నాయా?

ఇంకా లేదు. ఇంట్లో నుంచే డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఎక్కడికి, ఎవరికి పంపారనే లింకు పట్టుకుని ఆ నగదంతా రికవరీ చేయాలి. బంగారం ఇంకా రికవరీ చేయలేదు. చిన్నచిన్న గాయాలున్నాయి. ఆసుపత్రికి వెళతారు.


డబ్బు కోసమే కిడ్నాప్‌
- ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

‘ఈ కిడ్నాప్‌నకు... పార్టీ వ్యవహారాలు గానీ, కక్ష సాధింపు గానీ, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాలు గానీ కారణం కాదు. రౌడీషీటరు, నేరప్రవృత్తి కలిగిన హంతకుడు హేమంత్‌ డబ్బు కోసం చేసిన కిడ్నాప్‌ ఇది. జీవీ కనిపించకపోయేసరికి అనుమానం వచ్చి సీపీ దృష్టికి తీసుకువచ్చా. రెండు గంటల్లోనే పోలీసులు కేసు ఛేదించారు. ఎవరి ప్రాణాలకూ హాని కలగకుండా కాపాడారు. నా కుటుంబానికి ఎలాంటి రక్షణా అవసరం లేదు. నాకు వ్యాపారంలోనూ, పార్టీల్లోనూ ఎలాంటి శత్రువులు లేరు’ అని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పేర్కొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని