దర్యాప్తునకు భయపడి... ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు!

ఒక హత్య కేసులో భాగంగా నిందితుల ఆచూకీ కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ యువకుడు పక్క భవనంపైకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.

Updated : 21 Sep 2023 06:20 IST

హత్యకేసు విచారణకు హైదరాబాద్‌ వచ్చిన ఏపీ పోలీసులు
భయపడి పక్క భవనంపై దూకిన యువకుడికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఒక హత్య కేసులో భాగంగా నిందితుల ఆచూకీ కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన పోలీసులను చూసి భయపడ్డ యువకుడు పక్క భవనంపైకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో సోమవారం సాయంత్రం జరిగిన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసతిగృహం, పోలీసుల వివరాల ప్రకారం..డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిధిలోని ఈదరపల్లిలో సెప్టెంబరు 1న పోలిశెట్టి కిశోర్‌, అడపా సాయి లక్ష్మణ్‌పై కొందరు దాడిచేశారు. ఈ దాడిలో పోలిశెట్టి కిశోర్‌ మృతిచెందాడు. ఈ హత్యకు సంబంధించి నిందితుల సమాచారం కోసం అమలాపురం పోలీసులు ఈ నెల 18న సాయంత్రం హైదరాబాద్‌లోని మాదాపూర్‌కు వచ్చారు. నిందితులకు ఆశ్రయం ఇచ్చారన్న సమాచారంతో మాదాపూర్‌లో ఉద్యోగం చేసే పోలిశెట్టి ఫణిశంకర్‌ను తొలుత అదుపులోకి తీసుకున్నారు. ఫణిశంకర్‌ తనకేమీ తెలియదని... కేపీహెచ్‌బీలో ఉండే ఫార్మా ఉద్యోగి మాచిరాజు ఫణిశ్రీనివాస్‌(25)కు సమాచారం ఉంటుందని చెప్పాడు. పోలీసులు ఫణిశ్రీనివాస్‌ ఉండే కేపీహెచ్‌బీలోని శ్రీబాలాజీ వసతిగృహానికి రాత్రి 8.30 గంటల సమయంలో చేరుకున్నారు. అప్పటికే పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో గదికి తాళం వేసిన ఫణిశ్రీనివాస్‌ భయంతో నాలుగో అంతస్తు నుంచి పక్కనున్న భవనంపైకి దూకాడు. ఆ భవనం మూడో అంతస్తులోని పెంట్‌హౌస్‌పై తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. శ్రీనివాస్‌ను ఈఎస్‌ఐ ఆసుపత్రిలో చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని