Drugs Case: నటుడు నవదీప్‌ ఫోన్లలో డేటా మాయం!

టాలీవుడ్‌ను వణికిస్తున్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఎట్టకేలకు సినీనటుడు నవదీప్‌ టీఎస్‌న్యాబ్‌(తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) పోలీసుల విచారణకు హాజరయ్యారు.

Updated : 29 Oct 2023 10:28 IST

గతంలో డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలున్నట్టు అంగీకారం
ప్రస్తుతం ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించట్లేదని వెల్లడి
మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో 6 గంటలపాటు విచారించిన టీఎస్‌న్యాబ్‌

ఈనాడు, హైదరాబాద్‌: టాలీవుడ్‌ను వణికిస్తున్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఎట్టకేలకు సినీనటుడు నవదీప్‌ టీఎస్‌న్యాబ్‌(తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది అరెస్టయ్యారు. వారి వద్ద లభించిన కొనుగోలుదారుల జాబితాలో పోలీసులు నవదీప్‌ పేరును గుర్తించారు. ఈ విషయం తెలియగానే వెంటనే అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించి తనను అరెస్టు చేయకుండా అనుమతి తీసుకున్నారు. అనంతరం టీఎస్‌న్యాబ్‌ పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ గురువారం నోటీసులు జారీచేశారు. ఈ మేరకు శనివారం నాంపల్లిలోని పోలీసు కార్యాలయానికి వచ్చిన నవదీప్‌ను ఎస్పీ సునీతారెడ్డి ఆధ్వర్యంలోని బృందం విచారించింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతడి నుంచి కీలక సమాచారం సేకరించినట్టు సమాచారం. తొలుత తనకేం తెలియదంటూ బుకాయించేందుకు ప్రయత్నించినా పోలీసులు అతడి ఫోన్‌కాల్‌ డేటా, నిందితులతో జరిపిన సంప్రదింపులు, పబ్బుల్లో ఏర్పాటు చేసిన పార్టీల వివరాలు ముందుంచి అడగటంతో దారికొచ్చినట్టు తెలుస్తోంది. గతంలో తాను పబ్‌ నిర్వహించినప్పుడు డ్రగ్స్‌ ముఠాలతో పరిచయాలున్న మాట వాస్తవమేనని అంగీకరించినట్టు సమాచారం. అతడి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిల్లో డేటా, చాటింగ్‌లు మొత్తం తొలగించి ఉండటంతో తిరిగి సేకరించేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే వివరాల ఆధారంగా మరోసారి నవదీప్‌ను విచారణకు పిలిచే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చా: నవదీప్‌

టీఎస్‌న్యాబ్‌ పాన్‌ఇండియా తరహాలో డ్రగ్స్‌పై లోతుగా దర్యాప్తు చేస్తోంది. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఎస్పీ సునీతారెడ్డి సారథ్యంలో అద్భుతంగా పనిచేస్తోంది. డ్రగ్స్‌ కేసులో నేను పారిపోయానంటూ దుష్ప్రచారం చేశారు. బాధ్యత గల జర్నలిస్టులు నిజాలు తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్‌ కేసులో నిందితులు అరెస్టయినప్పుడు నాకు పోలీసుల నుంచి ఎటువంటి ఫోన్‌ కాల్‌ రాలేదు. ప్రస్తుతం నోటీసులు జారీ చేస్తేనే వచ్చాను. వారు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాను. గతంలో నేను పబ్‌ నిర్వహించినప్పుడు సిట్‌, ఈడీ దర్యాప్తునకు హాజరయ్యాను. అప్పుడు ఇచ్చిన జవాబులే ఇప్పుడూ ఇచ్చాను. టీఎస్‌న్యాబ్‌ నా సెల్‌ఫోన్‌లో 8 ఏళ్ల క్రితం నాటి డేటా రాబట్టి దర్యాప్తు చేయడం చూసి ఆశ్చర్యమేసింది. అందులో ఒక రిమోట్‌లింక్‌ బయటపడటంతో నన్ను విచారణకు పిలిచారు. పోలీసులు మళ్లీ ఎప్పుడు పిలిచినా హాజరవుతాను.


81 లింకులు గుర్తించాం: టీఎస్‌న్యాబ్‌ ఎస్పీ సునీతారెడ్డి

నవదీప్‌ను పూర్తిస్థాయిలో విచారించాం. ఈ కేసులో 81 లింకులు గుర్తించాం. వాటిలో నవదీప్‌ 41 లింకుల గురించి వివరాలు అందజేశారు. గతంలో సిట్‌, ఈడీ ఆయన్ను విచారించినప్పుడు డ్రగ్స్‌ కొనుగోలు చేసినట్లు ఒప్పుకొన్నారు. ప్రస్తుతం ఎటువంటి మత్తుపదార్థాలు వినియోగించట్లేదని చెప్పారు. ఈ కేసులో నిందితుడు రాంచంద్‌ నవదీప్‌కు మిత్రుడని అంగీకరించారు. వారిద్దరు భాగస్వాములుగా బీపీఎం పబ్‌ను నిర్వహించినట్టు తెలిపారు. నవదీప్‌ రెండు ఫోన్లలోని డేటా తిరిగి సేకరించాక మరోసారి విచారిస్తాం. ఆయన కొద్దిరోజులు తన తల్లి ఫోన్‌ వాడినట్లు తెలిసింది. అవసరమైతే అందులోని డేటా కూడా సేకరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని