స్నేహితుల మధ్య చిచ్చురేపిన సిగరెట్‌?

సిగరెట్‌ కోసం జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది.

Published : 24 Sep 2023 04:07 IST

సహచరుడి గొంతుకోసి హతమార్చిన వైనం

విశాఖపట్నం, న్యూస్‌టుడే: సిగరెట్‌ కోసం జరిగిన ఘర్షణలో ఓ బాలుడిని తోటి స్నేహితులు గొంతుకోసి హతమార్చిన ఘటన విశాఖలో కలకలం సృష్టించింది. సీఐ రేవతమ్మ కథనం ప్రకారం... ఏవీఎన్‌ కళాశాల సమీపంలో నూకాలమ్మ అనే మహిళ తన కుమారుడు చిన్నా(17)తో కలిసి నివసిస్తోంది. చిన్నా కొద్దికాలంగా వ్యసనాలకు బానిసయ్యాడు. పాతనగరంలోని విస్కీ అనే రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకున్నాడు. ఈ నెల 20న స్నేహితులతో కలిసి చవితి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. 21 అర్ధరాత్రి దాటాక చిన్నా, మరో నలుగురు బాలురు సిగరెట్లు తాగారు. సిగరెట్‌ విషయమై వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో స్నేహితులు కత్తితో చిన్నాను గొంతు కోసి హతమార్చి గోనె సంచితో మృతదేహాన్ని దాచిపెట్టారు. వినాయకచవితి ఉత్సవ సామగ్రిని సముద్రంలో కలపాలని తెల్లవారుజామున ఆటోడ్రైవర్‌ రాముతో బేరం కుదుర్చుకున్నారు. మృతదేహాన్ని ఆటోలో చేపలరేవు వద్దకు తీసుకెళ్లి సముద్రంలో విసిరేసి వెళ్లిపోయారు. మృతదేహం దొరికిన తర్వాత పోలీసులు ఆటోడ్రైవర్‌ను గుర్తించి విచారించగా నలుగురు పిల్లల గురించి చెప్పాడు. వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. ఆ నలుగురినీ జువైనల్‌ హోంకు తరలించారు. పిల్లల మధ్య ఘర్షణకు గంజాయి కారణమై ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు