నేరగాళ్లలో 95 శాతం మంది కొత్తవారే

నల్గొండ జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్‌ విజయ్‌ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి కరోనాతో చనిపోయిందని బంధువులకు చెప్పాడు. 

Updated : 25 Sep 2023 06:03 IST

గత నేరచరిత్ర లేనివారే అధికం

నల్గొండ జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్‌ విజయ్‌ ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు మకాం మార్చాడు. భార్యపై అనుమానంతో ఆమెను హత్య చేసి కరోనాతో చనిపోయిందని బంధువులకు చెప్పాడు.  చూసేందుకు ఎవర్నీ రావొద్దన్నాడు. మృతదేహాన్ని తన ఆటోలోనే స్వగ్రామానికి తీసుకెళ్లి ఖననం చేశాడు. విజయ్‌కు కరోనా సోకకపోవడంతో కవిత కుటుంబ సభ్యులకు అనుమానమొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆరు రోజుల తర్వాత మృతదేహాన్ని వెలికితీసి శవపంచనామా చేశారు. దర్యాప్తులో విజయ్‌ కుట్ర బయటపడింది. అతడికి ఎలాంటి గత నేరచరిత్ర లేదు. వివిధ నేరాల్లో పోలీసులు అరెస్టు చేస్తున్న నిందితుల్లో దాదాపు 95 శాతం మంది కొత్తవాళ్లే ఉంటున్నారు.

ముందే పసిగట్టడం.. పోలీసులకు సవాలే

పక్కాగా పథకం.. అదను కోసం ఎదురుచూపులు.. పకడ్బందీగా అమలు.. ఇదీ ఒకప్పుడు నేరగాళ్లు అనుసరించిన పంథా. ఇళ్లలో దొంగతనాలు.. వ్యక్తులపై దాడులు.. ఇలాంటి వ్యవస్థీకృత నేరాలు తగ్గుముఖం పడుతున్నాయి. రిపీటెడ్‌ అఫెండర్స్‌(తరచూ నేరాలకు పాల్పడేవారు) స్థానంలో కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. హత్య, హత్యాచారం.. మరేదైనా ఘరానా నేరం.. వీటిలో నిందితులంతా దాదాపుగా కొత్తవారే ఉంటున్నారు. వీరికి ఎలాంటి గత నేరచరిత్ర ఉండటం లేదు. వ్యక్తిగత కక్షలతో కొందరు.. ప్రతీకారం తీర్చుకునేందుకు మరికొందరు నేరగాళ్లుగా మారుతున్నారు. వీరిలో కొందరు క్షణికావేశంలో.. మరికొందరు పథకం రచించి మరీ నేరాలకు పాల్పడుతున్నారు. యువకులు ఎక్కువగా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పడుతున్నారు. సాధారణంగా పాత నేరగాళ్లపై పోలీసుల నిఘా ఉంటుంది. తరచూ దొంగతనాలు, దోపిడీలు చేసేవారిపై ఓ కన్నేస్తారు. ఈ తరహా నేరగాళ్లు పట్టుబడి.. జైలుశిక్ష అనుభవించి విడుదలైన తర్వాత కూడా వారి కదలికలపై ఆరా తీస్తుంటారు. కొత్త నేరగాళ్ల విషయంలో అలా కుదరడం లేదు. ముఖ్యంగా వ్యక్తిగత కక్షలతో నేరాలకు పాల్పడుతుండటంతో పసిగట్టడం సవాల్‌గా మారుతోంది.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని