పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో లక్ష్యాలు సాధించాల్సిందేనంటూ ఉన్నతాధికారులు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సచివాలయ ఉద్యోగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Published : 27 Sep 2023 06:58 IST

రంపచోడవరం, గంగవరం, న్యూస్‌టుడే: జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో లక్ష్యాలు సాధించాల్సిందేనంటూ ఉన్నతాధికారులు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సచివాలయ ఉద్యోగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సర్వేయర్లు తెలిపిన వివరాల ప్రకారం... దేవీపట్నం మండలం ఇందుకూరుకు చెందిన నాగార్జున గంగవరం మండలం జగ్గంపాలెం సచివాలయంలో గ్రామ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా వేగంగా సర్వే పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారికి తెలిపారు. అయినప్పటికీ వెంటనే ఎస్‌.ఆర్‌. పట్టుకొని తనవద్దకు రావాలని అధికారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐటీడీఏకి వెళ్లగా ఎస్‌.ఆర్‌. మండల సర్వేయర్‌కు ఇచ్చి వెళ్లిపోవాలని పీఓ సీసీ చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాను అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని మంగళవారం ఓ లేఖ సర్వేయర్ల వాట్సప్‌ గ్రూపులో పెట్టాడు. దీంతో తోటి సర్వేయర్లు వెంటనే జగ్గంపాలెం వెళ్లి గాలించగా పెట్రోల్‌ బంక్‌ వద్ద అటవీ ప్రాంతంలో కిందపడి ఉన్నట్టు గుర్తించారు. చెట్టుకు ఉరి వేసుకోవడానికి యత్నించగా తాడు తెగిపోయిందని, బ్లేడుతో చెయ్యి కోసుకున్నాడని సర్వేయర్లు తెలిపారు. వెంటనే ఆయనను తూర్పుగోదావరి జిల్లా గోకవరం సామాజిక ఆసుపత్రిలో చేర్పించామని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని