మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నారా?

‘మా అన్నయ్యకు చెందిన రూ.50 కోట్ల భూమిని కాజేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లు సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారు.

Updated : 30 Sep 2023 06:47 IST

లేదంటే ఆయన అస్తికలైనా ఇప్పించండి
రూ.50 కోట్ల భూమి కబ్జాకు వైకాపా నేతల కుట్ర
పోలీసులకు ఓ అభాగ్యుడి ఫిర్యాదు

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ‘మా అన్నయ్యకు చెందిన రూ.50 కోట్ల భూమిని కాజేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో భాగంగానే ఫోర్జరీ సంతకాలతో అగ్రిమెంట్లు సృష్టించి కోర్టును తప్పుదారి పట్టించారు. కొంతకాలంగా మా అన్నయ్య, ఆయన కుటుంబీకులూ కనిపించడం లేదు. వారు ప్రాణాలతో ఉన్నారా? ఉంటే వెతికి పెట్టండి. ప్రాణాలతో లేని పక్షంలో అస్తికలైనా ఇప్పించండి..’ అంటూ ఓ సోదరుడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన విన్నపంపై పోలీసులు కేసు నమోదు చేయకపోగా, ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండంటూ వెనక్కి పంపించేశారు. బాధితుడి కథనం మేరకు.. పుట్టపర్తికి చెందిన కరణం గోపాల్‌రావుకు ఎనిమిది మంది సంతానం. ఆస్తిని కుమారులందరికీ సమానంగా పంచారు. ఇందులో ఓ కుమారుడు రామకృష్ణకు 18.30 ఎకరాలు వచ్చాయి. ఆయన తన కుటుంబంతో కలిసి బెంగళూరులో ఉంటున్నారు.

దీన్ని అదనుగా భావించిన కొంతమంది స్థానిక వైకాపా నాయకులు తన అన్నయ్య భూమిని కాజేయడానికి కుట్ర చేసినట్లు ఆయన సోదరుడు చంద్రశేఖర్‌రావు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే బోగస్‌ అగ్రిమెంట్లు సృష్టించి న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించారని వివరిస్తున్నారు. ప్రస్తుతం తన అన్నయ్య కుటుంబం కనిపించడం లేదని, వారిని ఏమైనా చేశారనే అనుమానం కలుగుతోందని తెలిపారు. స్థానిక వైకాపా నాయకులు ఎ.రఘునాథరెడ్డి, జె.రాముతోపాటు పుట్టపర్తికి చెందిన కరణం సుబ్రహ్మణ్యేశ్వరరావు, శేషు, షాకీర్‌లు కుట్రకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన అన్న భూమిలోకి మీరెందుకు వస్తున్నారని ప్రశ్నిస్తే.. ‘మీ అన్న కథ ముగిసింది. నీ అంతు కూడా చూస్తాం. ప్రాణాలతో ఉండాలంటే ఇక్కడినుంచి వెళ్లిపో.. లేదంటే నీకూ మీ అన్న గతి పడుతుంది..’ అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని