గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుంటే నదిలోకి..

భారీగా వర్షం పడుతున్న సమయంలో గూగుల్‌ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్‌ చేయడంతో కారు నదిలో మునిగి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు.

Published : 03 Oct 2023 02:36 IST

కేరళలో ప్రాణాలు పోగొట్టుకొన్న ఇద్దరు యువ వైద్యులు

కోచి: భారీగా వర్షం పడుతున్న సమయంలో గూగుల్‌ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్‌ చేయడంతో కారు నదిలో మునిగి ఇద్దరు యువ వైద్యులు మృతి చెందారు. కేరళలో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. డాక్టర్‌ అద్వైత్‌ (29), డాక్టర్‌ అజ్మల్‌ (29)లు త్రిశూర్‌ జిల్లాలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకొని వీరు శనివారం రాత్రి ఇళ్లకు బయల్దేరారు. వీరితోపాటు డాక్టర్‌ తబ్సిర్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థిని తమన్నా, నర్స్‌ జిస్మాన్‌ కూడా కారులో ఎక్కారు. డ్రైవింగ్‌ సీట్లో కూర్చొన్న అద్వైత్‌ గూగుల్‌ మ్యాపులను అనుసరించి డ్రైవింగ్‌ చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న తమన్నా చెప్పారు. దానిని అనుసరించిన అతడు మార్గమధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డుగా భ్రమించి.. కారును నేరుగా పెరియార్‌ నదిలోకి తీసుకెళ్లాడు. స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్‌, అజ్మల్‌ ప్రాణాలు కోల్పోయారు. ‘‘గూగుల్‌ మ్యాపులు చూపిస్తున్న మార్గాన్ని వారు అనుసరిస్తున్నారు. మ్యాపులో ఎడమవైపునకు వెళ్లమని ఉంది. పొరపాటున నేరుగా వెళ్లారు. నదిలో పడిపోయారు’’ అని పోలీసుల పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. వర్షాకాలంలో సాంకేతికతను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని