దళిత యువకుడిపై పోలీసుల దాష్టీకం

విచారణ పేరుతో 24ఏళ్ల దళిత యువకుడిని మద్యం మత్తులో ఇద్దరు క్రైం పోలీసులు విచక్షణరహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపించి యువకుడి కాలు విరగ్గొట్టారు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

Updated : 03 Oct 2023 10:04 IST

కోళ్ల దొంగతనం కేసులో  విచారణ పేరిట కాలు విరగ్గొట్టిన వైనం!
ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు
విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్‌  పరిధిలో ఘటన

ఈనాడు-విశాఖపట్నం, పద్మనాభం-న్యూస్‌టుడే: విచారణ పేరుతో 24ఏళ్ల దళిత యువకుడిని మద్యం మత్తులో ఇద్దరు క్రైం పోలీసులు విచక్షణరహితంగా చితకబాదారు. లాఠీలతో ప్రతాపం చూపించి యువకుడి కాలు విరగ్గొట్టారు. ఈ ఘటన విశాఖ జిల్లా పద్మనాభం స్టేషన్‌ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాందేవుపురం గ్రామానికి చెందిన ఇందుకూరు రాజాబాబు తన షెడ్డులోని కోళ్లు చోరీకి గురయ్యాయంటూ సెప్టెంబరు 29వ తేదీన పద్మనాభం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అదే గ్రామానికి చెందిన బాందేవపురం పాపు, గాలి ఎర్నిబాబులను అనుమానించి పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. ఆదివారం ఉదయం విచారణ తర్వాత కేసును అదే స్టేషన్‌ పరిధిలోని క్రైం విభాగ పోలీసులకు అప్పగించారు.

తంతే మీరే ఇస్తారంటూ....

పోలీసులు ఆదివారం రాత్రి వారిని అక్కడే ఉంచారు. ఈ సమయంలో కానిస్టేబుళ్లు కె.శ్రీను, కె.సతీష్‌ వారిని విచారించారు. తప్పు ఒప్పుకొన్నామని, రాజాబాబుతో రాజీ అయ్యామని పాపు, ఎర్నిబాబు పోలీసులకు చెప్పారు. అయితే చెరో రూ.5వేలు చొప్పున తమకు ఇవ్వాలంటూ కానిస్టేబుళ్లు డిమాండ్‌ చేసినట్లు ఘటన అనంతరం బాధితులు పేర్కొన్నారు. అంత మేం ఇచ్చుకోలేమని చెప్పగా, తంతే మీరే ఇస్తారంటూ మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని చితకబాదారు. గతంలో జరిగిన ఆటో ప్రమాదంలో పాపు కుడి కాలు విరగ్గా శస్త్రచికిత్స జరిగింది. అదే కాలుపై కానిస్టేబుళ్లు కొట్టారు. తట్టుకోలేక పాపు, ఎర్నిబాబు పెద్దగా కేకలు వేయడంతో స్టేషన్‌ బయటఉన్న కుటుంబ సభ్యులు లోపలికి పరుగెత్తుకొచ్చారు. వారిని చూసి కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్‌ గోడదూకి పారిపోయారు. అనంతరం కాలు విరిగిన పాపుని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు అర్ధరాత్రి స్టేషన్‌ ముందు ధర్నా నిర్వహించారు. క్రైం డీసీపీ నాగన్న స్టేషన్‌కు వచ్చి దర్యాప్తు చేశారు. పాపు ఫిర్యాదు మేరకు ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పద్మనాభం ఎస్సై మల్లేశ్వరరావు, కానిస్టేబుళ్లు శ్రీను, సతీష్‌లను సస్పెండ్‌ చేస్తూ సీపీ రవిశంకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషన్‌ సీఐ సన్యాసినాయుడికి ఛార్జి మెమో ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని