విశాఖ చేపలరేవులో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ సాగర తీరంలోని చేపలరేవులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 45 మెకనైజ్డ్‌ బోట్లు మంటల్లో చిక్కుకున్నాయి.

Updated : 21 Nov 2023 04:33 IST
ఈనాడు-విశాఖపట్నం, వన్‌టౌన్‌-న్యూస్‌టుడే: విశాఖ సాగర తీరంలోని చేపలరేవులో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 45 మెకనైజ్డ్‌ బోట్లు మంటల్లో చిక్కుకున్నాయి. వీటిలో 36 పూర్తిగా బూడిద కాగా తొమ్మిది పాక్షికంగా కాలిపోయాయి. ఒక్కో బోటు విలువ రూ.30-40 లక్షలు ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు. సుమారు రూ.15 కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్లు మత్స్యశాఖ అధికారుల అంచనా. జీరో జెట్టీ వద్ద లంగరు వేసిన ఓ బోటులో తొలుత మంటలు రేగాయి. క్రమంగా అగ్నికీలలు మిగతా బోట్లకు అంటుకున్నాయి. ఈ ప్రమాదం మత్స్యకార కుటుంబాలకు గుండెకోతను మిగిల్చింది. జీవనాధారమైన బోటు కళ్ల ముందే కాలిపోతుండటాన్ని చూసి, తట్టుకోలేని ఓ బాధితుడు మంటల్లో దూకేందుకు ప్రయత్నించడం చూపరులను కంటతడి పెట్టించింది. ఆదివారం రాత్రి 11.10 గంటలకు జీరో జెట్టీపై ఉన్న ఓ బోటులో మంటలురేగాయి. ఇతర బోట్ల ఆపరేటర్లు... లంగరు తీసి ఆ బోటును పక్కకు లాగేందుకు యత్నించారు. అంతలోనే మరో బోటుకు మంటలు వ్యాపించాయి. వేగంగా వీచిన గాలులకు అగ్నికీలలు పెద్దవై మిగతా బోట్లకు అంటుకున్నాయి. వేటకు వెళ్లేందుకు బోట్లలో సిద్ధంగా ఉంచుకున్న డీజిల్‌ నిల్వలు కాలిపోయి ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. గ్యాస్‌ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఆ పేలుళ్లకు లేచిన అగ్గి రవ్వలు జెట్టీ సమీపంలోని వేలం కేంద్రంపై పడి చెక్కపెట్టెలు కాలి బూడిదయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటల దాకా మంటలు చల్లారలేదు. అగ్నిమాపక శాఖ, పోర్టు నౌకాదళం సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.  

యూట్యూబ్‌లో వీడియో

ఈ ఘటనపై వన్‌టౌన్‌ స్టేషన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ యూట్యూబర్‌ ‘లోకల్‌బాయ్‌ నాని’... బోట్లు కాలిపోతుండగా చిత్రీకరించి ఆ వీడియోను తన ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు. నాని, అతని స్నేహితులపై అనుమానంతో పోలీసులు సోమవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన భార్య సీమంతం కావడంతో నాని ఆదివారం ఇంట్లోనే ఉన్నట్లు, రాత్రి 7 గంటలకు స్నేహితులతో కలిసి ఓ హోటల్‌లో పార్టీ చేసుకుని, 11 గంటలకు బయటకు వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా పోలీసులు నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. నానికి ప్రమాదం గురించి తెలిసి, ఘటన స్థలానికి వెళ్లి వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.  
మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సోమవారం మధ్యాహ్నం చేపలరేవును సందర్శించి, కాలిపోయిన బోట్లను పరిశీలించారు. జీవనోపాధిని కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలంటూ చేపలరేవు గేటు వద్ద ఆందోళనకు దిగిన మత్స్యకారులు, బోట్ల ఆపరేటర్లతో మాట్లాడారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బోట్లు కాలిపోయి నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  ప్రభుత్వానికి ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

తప్పిన పెను ప్రమాదం

జీరో జెట్టీని ఆనుకొని హెచ్‌పీసీఎల్‌కు చెందిన డీజిల్‌, పెట్రోలు నిల్వ చేసే ట్యాంకర్లు ఉన్నాయి. మరోవైపు జెట్టీకి 500 మీటర్ల దూరంలో కంటైనర్‌ టెర్మినల్‌ కార్పొరేషన్‌ ఉంది. బోట్లలోని గ్యాస్‌ సిలిండర్లు పేలిన సమయంలో నిప్పు రవ్వలు ఆయిల్‌ ట్యాంకర్లపై పడి ఉంటే భారీగా ప్రాణనష్టం సంభవించి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఎంఎన్‌-12 బోటులో కొందరు యువకులు పార్టీ చేసుకున్నారని, అందులోనే మంటలు రేగాయని విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌ మీడియాకు తెలిపారు.

సీఎం దిగ్భ్రాంతి : అగ్ని ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. దగ్ధమైన బోట్ల విలువలో 80 శాతం పరిహారంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లోతైన దర్యాప్తు నిర్వహించి, ప్రమాద కారణాల్ని వెలికి తీయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని