టపాసుల గోదాము దగ్ధం

బోగోలు మండలంలోని కోవూరుపల్లి చెరువు సమీపంలో ఉన్న టపాసుల గోదాములో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందులో ఉన్న పీˆట్ల సురేష్‌రేనా (13) అనే బాలుడు ప్రాణాలు కోల్పోగా యజమానితో పాటు మరొకరికి గాయాలయ్యాయి.

Updated : 11 Jun 2024 06:05 IST

బాలుడి మృత
యజమానితో పాటు మరొకరికి గాయాలు

ఎగసిపడుతున్న మంటలు.. 

బిట్రగుంట, న్యూస్‌టుడే: బోగోలు మండలంలోని కోవూరుపల్లి చెరువు సమీపంలో ఉన్న టపాసుల గోదాములో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందులో ఉన్న పీట్ల సురేష్‌రేనా (13) అనే బాలుడు ప్రాణాలు కోల్పోగా యజమానితో పాటు మరొకరికి గాయాలయ్యాయి. బాలుడు కప్పరాళ్లతిప్ప గ్రామానికి చెందిన వాడు. గోదాములో రాత్రి అకస్మాత్తుగా మంటలు రేగాయి. దీంతో అందులో ఉన్న  సురేష్‌రేనా, గోదాము యజమాని మాదినేని సుమంత్‌కు గాయాలయ్యాయి. వీరిని కాపాడేందుకు ప్రయత్నించిన మాదినేని నాగేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. విద్యుత్తు షార్ట్‌సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. ఘటన జరిగిన వెంటనే కావలి గ్రామీణ సీఐ నాగభూషణం, ఎస్సై భోజ్యానాయక్, సిబ్బందితో సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను కావలికి తరలించారు. బాలుడు సురేష్‌రేనా పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించగా చికిత్స పొందుతూ  ప్రాణాలు కోల్పోయాడు. కావలి నుంచి అగ్నిమాపక వాహనంతో వచ్చిన సిబ్బంది మంటలు ఆర్పారు. ఒక దశలో రేకుల కింద ఉన్న టపాసులు పేలడంతో అందరూ పరుగులు పెట్టారు. ఈ విషయమై కావలి గ్రామీణ సీఐ నాగభూషణం మాట్లాడుతూ క్షతగాత్రుల్ని కాపాడే ప్రయత్నం చేశామన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగింది, ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకొని కేసు నమోదు చేస్తామని చెప్పారు. 


రోడ్డు ప్రమాదంలో డిస్కం ఏఈ దుర్మరణం

కలువాయి, న్యూస్‌టుడే:  బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన డిస్కం ఏఈ యశ్వంత్‌ (26) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇతను రెండు రోజుల క్రితం బెంగళూరుకు వెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఇతని కుటుంబసభ్యులు నెల్లూరులో నివాసం ఉంటున్నారు. 


ఉరేసుకొని బలవన్మరణం

వెంకటాచలం, న్యూస్‌టుడే: మండలంలోని చెముడుగుంట పంచాయతీలోని ఓ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న రామూర్తి సురేశ్‌(38) కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడు చెన్నైకి చెందిన వ్యక్తి అని గుర్తించారు. ఆదివారం ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కారును ఢీకొన్న ట్యాంకర్‌.. తప్పిన ప్రమాదం

సంగం : ఆగి ఉన్న కారును సిమెంటు ట్యాంకర్‌ ఢీకొన్న ఘటనలో పలువురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సంగంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన వ్యక్తులు.. కారులో తమ స్వగ్రామానికి బయల్దేరారు. సంగం కొండ దిగుతున్న సమయంలో ఎదురుగా గేదెలు రావడంతో రోడ్డు పక్కకు కారు నిలిపారు. ఆ సమయంలో కృష్ణపట్నం నుంచి బళ్లారికి వెళుతున్న సిమెంటు ట్యాంకరు వేగంగా వచ్చి కారుని ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు కారు వెనక భాగం మాత్రమే దెబ్బతినడంతో అందులోని వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ట్యాంకరు కింద రెండు గేదెలు ఇరుక్కు పోయాయి. అందులో ఒకటి మృతి చెందగా, మరొక దాన్ని జేసీబీ సాయంతో బయటకి తీయించి అధికారులు రక్షించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని