అలంకరణ పనికి వెళ్లివస్తూ.. అనంత లోకాలకు

అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు కొద్ది సమయంలో ఇంటికి చేరేలోపు రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది.

Updated : 11 Jun 2024 06:13 IST

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం  
ముగ్గురు కూలీల దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం  
8 మందికి గాయాలు

 మిల్లర్‌ను ఢీకొన్న కారు

పెదకాకాని, నగరపాలెం, న్యూస్‌టుడే: అలంకరణ పనులకు వెళ్లి వస్తున్న కూలీలు కొద్ది సమయంలో ఇంటికి చేరేలోపు రోడ్డు ప్రమాదరూపంలో మృత్యువు కబళించింది. పెదకాకాని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 9 మందికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. సిమెంటు, కంకర కలిపే మిల్లర్‌ను ఐషర్‌ వాహనం వెనుక కట్టుకొని గుంటూరు వైపు తీసుకెళ్తోంది. పెదకాకాని అమెరికన్‌ ఆంకాలజీ క్యాన్సర్‌ ఆసుపత్రి ఎదుట ఉన్న జాతీయ రహదారి వద్దకు వచ్చే సరికి మరమ్మతులకు గురై రోడ్డు కుడివైపు నిలిచిపోయింది. ఆగి ఉన్న ఐషర్‌ వాహనాన్ని గమనించకపోవడంతో వెనుక నుంచి వచ్చిన కారు మిల్లర్‌ని బలంగా ఢీకొట్టింది. మిల్లర్‌ రోడ్డు మధ్యలోకి జరిగింది. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి కూలీలతో వస్తున్న టాటా ఏస్‌ మినీ వాహనం మిల్లర్‌ని ఢీకొంది. భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో టాటా ఏస్‌లో ఉన్న పేరేచర్లకు చెందిన కె.రాంబాబు(40), గుంటూరు నగరానికి చెందిన తేజ (21) అక్కడికక్కడే మృతి చెందగా.. పాత గుంటూరుకు చెందిన డి.మధు (25) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యులు ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కారులోని ముగ్గురు స్వల్పంగా గాయపడటంతో గుంటూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టాటా ఏస్‌లో 9 మంది కూలీలు ఉదయం విజయవాడ వెళ్లి శుభకార్యం అలంకరణ పనిముగించుకొని ఇంటికి వస్తుండగా.. రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని