వివాదాల డి బాస్‌

అభిమానులు ముద్దుగా ‘డి’ బాస్‌ అంటూ పిలుచుకునే ఆయన నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వివాదానికి కేంద్రబిందువుగా మారుతుంటారు. తానేం చేసినా వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. వెండితెరపై అభిమానులను అలరించే ఆయనకు నిజజీవితంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది.

Published : 12 Jun 2024 06:50 IST

హత్యకేసులో నటీనటులు దర్శన్, పవిత్రా గౌడ అరెస్టు
మరో పదకొండు మందినీ అరెస్టు చేశాం - దయానంద

పోలీసుల వాహనంలో దర్శన్‌

అభిమానులు ముద్దుగా ‘డి’ బాస్‌ అంటూ పిలుచుకునే ఆయన నిత్యం ఏదో ఒక వ్యవహారంలో వివాదానికి కేంద్రబిందువుగా మారుతుంటారు. తానేం చేసినా వార్తల్లో వ్యక్తిగా ఉంటారు. వెండితెరపై అభిమానులను అలరించే ఆయనకు నిజజీవితంలో వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం పరిపాటిగా మారింది. ఆయనే సినీ నటుడు దర్శన్‌. తాజాగా ఓ హత్యకేసులో ఆయన అరెస్టు కావడం చందనసీమలో తీవ్ర కలకలం రేపుతోంది.

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: చిత్రదుర్గ అపోలో మెడికల్స్‌లో నాలుగేళ్ల నుంచి పని చేస్తున్న రేణుకాస్వామి (28) అనే యువకుడిని హత్య చేసిన ఆరోపణలపై నటుడు దర్శన్‌ తూగుదీప, ఆయన స్నేహితురాలు, నటి పవిత్రగౌడ, చిత్రదుర్గ జిల్లా దర్శన్‌ అభిమానుల సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర, దర్శన్‌ స్నేహితులు, పారిశ్రామిక వేత్తలు పవన్, ప్రదోశ్, నందీశ్, కేశవమూర్తి, లక్ష్మణ్, దీపక్, కార్తిక్, మరో ముగ్గురు బౌన్సర్లను పోలీసులు అరెస్టు చేశారు. మైసూరులో వ్యాయామశాల నుంచి కెంపయ్యన హుండిలోని ఫాంహౌస్‌కు వెళ్లిన దర్శన్‌ను మంగళవారం ఉదయం అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకువచ్చారు. దర్శన్, ఇతర నిందితులకు బౌరింగ్‌ ఆసుపత్రిలో సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. నిందితులను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతించింది. దర్శన్‌కు జామీను ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది నారాయణస్వామి చేసిన వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు.  రాజరాజేశ్వరినగరలోని నివాసంలో ఆయనను అన్నపూర్ణేశ్వరినగర ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.  మంగళవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో నగర పోలీసు కమిషనర్‌ విలేకరులకు వివరాలను వెల్లడించారు. చిత్రదుర్గ లక్ష్మీ వేంకటేశ్వర లేఅవుట్ నివాసి రేణుకా స్వామి గతంలో కంప్యూటర్ల మరమ్మతు, బేసిక్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేవారు. ఏడాది క్రితం వివాహమైన ఆయన ప్రస్తుతం అపోలో మెడికల్స్‌లో పని చేస్తున్నారు. ఆయన భార్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణి.

పవిత్ర గౌడ

కొట్టి హత్య చేశారు

తనకు బెంగళూరుకు వెళ్లవలసిన పని ఉందని ఈనెల 8న ఇంట్లో చెప్పి వచ్చిన రేణుకాస్వామి మళ్లీ చిత్రదుర్గకు వెళ్లలేదు. సుమనహళ్లి సత్య అనుగ్రహ అపార్ట్‌మెంట్ సమీపంలోని మురుగు కాలువ వద్ద 9వ తేదీ అతని మృతదేహం లభించింది. ఆర్థిక లావాదేవీల్లో తలెత్తిన వివాదంతో తామే పట్టణగెరెలోని ఒక షెడ్డులో అతన్ని హత్య చేశామని ముగ్గురు బౌన్సర్లు గిరినగర ఠాణాలో లొంగిపోయారు. విచారణ అనంతరం మరో ఏడుగురు బౌన్సర్లను అరెస్టు చేశారు. దర్శన్, పవిత్రగౌడల సూచనలతోనే తాము హత్య చేశామని చెప్పడంతో వారినీ అరెస్టు చేశారు. తన స్నేహితురాలు పవిత్రగౌడకు అశ్లీల సందేశాలు పంపిస్తూ వేధిస్తుండడంతో అతన్ని హెచ్చరించాలని మాత్రమే తాను బౌన్సర్లకు సూచించానని పోలీసులకు దర్శన్‌ చెప్పారని సమాచారం. డీసీపీ గిరీశ్‌ కొంత సమయం దర్శన్‌ను విచారించారు. షెడ్డులోని సీసీ కెమెరా ఫుటేజ్‌లలో హత్య జరిగిన సందర్భంలో దర్శన్‌ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. మృతుని ఒంటిపై 15 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నాయి. వాటిలో మర్మావయాలకు దెబ్బ తగలడంతోనే మరణించాడని అనుమానిస్తున్నామని కొత్వాలు దయానంద్‌ తెలిపారు. మృతుని చరవాణి లొకేషన్, కాల్‌డేటాను పరిశీలించగా, దర్శన్‌ ఇంటి వద్దకు వెళ్లినట్లు గుర్తించామన్నారు. కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని బేడ జంగమ సముదాయం చిత్రదుర్గ జిల్లాధ్యక్షుడు ఎంటీ మల్లికార్జున స్వామి డిమాండ్‌ చేశారు.

రేణుకా స్వామి (హతుడు)

వివాహంపైనా ఆరోపణలు

నటుడు దర్శన్‌కు విజయలక్ష్మితో వివాహమైంది. కొన్నేళ్లుగా పవిత్ర గౌడతో కలిసి ఉంటున్నారు.  పవిత్ర గౌడతో కలిసి ఉండడంతో విజయలక్ష్మికి అన్యాయం అవుతుందన్న బాధతో రేణుకా స్వామి ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రగౌడను లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు పెట్టాడని దర్యాప్తులో తెలుసుకున్నారు. హత్య అనంతరం నీ వల్లే ఇదంతా జరిగిందని పవిత్రగౌడపై దర్శన్‌ దాడి చేయడంతో ఆమె గాయపడింది. రాజరాజేశ్వరినగర ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్సకు చేరి, సోమవారం సాయంత్రమే ఆమె ఇంటికి తిరిగి వెళ్లింది. దర్శన్‌పై హత్య, అపహరణ, హనీట్రాప్‌ కేసులు నమోదయ్యాయి. దర్శన్‌ నేరానికి పాల్పడి ఉంటే అతనికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధించాలని సీనియరు నటి రమ్య ట్వీట్లో డిమాండ్‌ చేశారు. దర్శన్‌ హత్య చేశారంటే నమ్మలేకపోతున్నానని మరో నటి సంజన పేర్కొన్నారు. ఈ ఘటన తన హృదయాన్ని ముక్కలు చేసిందని మరో నటి రక్షిత ఆక్రోశించారు.

ఇదే మొదటిసారి కాదు

నటుడు దర్శన్‌ కారాగారానికి వెళ్లడం ఇదే మొదటిసారి కాదు. తన భార్య విజయలక్ష్మిని కొట్టడంతో ఆమె 2011లో విజయనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ‘భగవాన్‌ శ్రీకృష్ణ పరమాత్మ’ అనే చిత్ర నిర్మాత భరత్‌ను బెదిరించి, కొట్టారన్న ఆరోపణలపై కెంగేరి ఠాణాలో కేసు నమోదైంది. దర్శన్‌కు చెందిన జాగిలం తనను కరచిందని అమితా జిందాల్‌ అనే వైద్యురాలు రాజరాజేశ్వరినగర ఠాణాలో ఫిర్యాదు చేశారు. చేతిలో తల్వార్‌ పట్టుకుని అభిమానుల ముందు ఫోజివ్వడం, పులిగోరును ధరించిన అంశంలోనూ దర్శన్‌ వివాదాలను ఎదుర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని