భారతీయ యువతను మభ్యపెట్టి.. ఉక్రెయిన్‌తో యుద్ధ ఊబిలోకి

మాస్కోలో ఉద్యోగావకాశాలు ఉన్నాయంటూ భారతీయ యువతను ఆశపెట్టి, తీరా వారు రష్యా చేరాక ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపుతున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారుల అరెస్టుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరనుంది.

Updated : 12 Jun 2024 06:50 IST

ముగ్గురు దళారుల అరెస్టుకు రెడ్‌కార్నర్‌ నోటీసు!

దిల్లీ: మాస్కోలో ఉద్యోగావకాశాలు ఉన్నాయంటూ భారతీయ యువతను ఆశపెట్టి, తీరా వారు రష్యా చేరాక ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపుతున్న ముగ్గురు మానవ అక్రమ రవాణాదారుల అరెస్టుకు రెడ్‌కార్నర్‌ నోటీసు జారీ చేయాల్సిందిగా ఇంటర్‌పోల్‌ను సీబీఐ కోరనుంది. రమేశ్‌కుమార్‌ పళనిసామి, మహమ్మద్‌ మొయినుద్దీన్‌ ఛిపా, దుబాయ్‌కు చెందిన ఫైజల్‌ అబ్దుల్‌ ముతాలిబ్‌ఖాన్‌ ఒక ముఠాగా పనిచేస్తూ భారతీయులను యుద్ధ ఊబిలోకి దింపుతున్నారు. ఈ ముగ్గురినీ అరెస్టు చేసి తమకు అప్పగించాలని సీబీఐ కోరుతోంది. విదేశీ ఉద్యోగాల వలతో భారతీయ యువతను ఆకట్టుకొని రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధరంగానికి పంపుతున్న ముఠాలపై సీబీఐ గత మార్చిలో దాడులు చేసింది. దిల్లీ, చండీగఢ్, పంజాబ్‌లలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నవారిపై కేసులు పెట్టింది. దుబాయ్‌కు చెందిన ముతాలిబ్‌ఖాన్‌ యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతూ భారతీయ యువకులకు రష్యాలో మంచి జీతాలతో సెక్యూరిటీ గార్డులుగా, హెల్పర్లుగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశ పెడుతున్నాడు. ఉద్యోగార్థులు చెన్నై విమానాశ్రయానికి చేరిన తరవాత వారి పాస్‌పోర్టులను ముతాలిబ్‌ఖాన్‌ తోడుదొంగలు తమ గుప్పెట్లోకి తీసుకొంటారు. మాస్కోలోని మరో ఇద్దరు వ్యక్తుల ఫోన్‌ నంబర్లను ఉద్యోగార్థులకు ఇస్తారు. వారు అక్కడికి చేరుకున్న తరవాత ఒక ఇంట్లో ఉంచి, రష్యా సైన్యం తరఫున పోరాడేలా ఒప్పందాలపై సంతకాలు తీసుకుంటారు. ఈ ఒప్పందాలు సాధారణ ఉద్యోగాల కోసమని నమ్మిస్తారు. సంతకాలు చేశాక వారిని యుద్ధరంగానికి పంపుతారు. ఇలా ఇప్పటిదాకా 35 మంది భారతీయులను మోసం చేశారని సీబీఐ కనుగొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని