గంజాయి ఘాటు..కట్టడి చేయకుంటే చేటు

జిల్లాల గంజాయి అక్రమ రవాణా, వాడకం చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది.

Updated : 13 Jun 2024 05:03 IST

జిల్లాలో చాపకింద నీరులా విస్తరణ
రైళ్లలో తరచూ తనిఖీల్లో స్వాధీనం 

రైల్లో పట్టుబడిన 60 కిలోల గంజాయి 
న్యూస్‌టుడే, వికారాబాద్‌: జిల్లాల గంజాయి అక్రమ రవాణా, వాడకం చాపకింద నీరులా విస్తరిస్తోంది. యువతే లక్ష్యంగా గంజాయి దందా కొనసాగుతోంది. వికారాబాద్, పరిగి, తాండూర్‌ పట్టణ శివార్లలో రహస్యంగా గంజాయి అమ్మకాలు సాగుతూ, గంజాయి ఘాటు గుప్పుమంటోంది. ఆబ్కారీ, రైల్వే రక్షణ దళం తమకు వచ్చిన సమాచారం మేరకు వికారాబాద్‌లో ఆగే రైళ్లలో తనిఖీచేసి రూ.లక్షల విలువైన గంజాయిని పట్టుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు వ్యాపారులు జిల్లాలో దళారులను ఏర్పాటుచేసుకుని విక్రయానికి యత్నిస్తున్నారు. దీంతో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఈ విషయంలో పోలీసులు చొరవ చూపాల్సిన అవసరాన్ని పేర్కొంటూ ‘న్యూస్‌టుడే’ కథనం. 

శివారు ప్రాంతాలు, కళాశాలలే లక్ష్యం

జిల్లాలో పరిగి, తాండూరు, కొడంగల్, వికారాబాద్‌ నియోజకవర్గాలుండగా దాదాపుగా అన్ని కళాశాలలు ఊరికి దూరంగానే ఉంటున్నాయి. కొన్ని మాత్రమే పట్టణ లేదా  గ్రామ మధ్యలో ఉంటున్నాయి. ఇక ఊరు పొలిమేర దాటిందంటే పూర్తి ఖాళీయే. ఇలాంటి వాటితోపాటు శివార్లలోని కళాశాల ప్రాంతాల్లో అనువుగా ఉండేలా గంజాయి వ్యాపారులు కొన్ని చోట్ల పొట్లాల రూపంలో అమ్ముతుండగా, మరికొన్ని చోట్ల సిగరెట్లలోని పొగాకుని తీసివేసి అందులో గంజాయిని కూర్చి ఒక్కో సిగరెట్టు రూ.100కు అమ్ముతున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయి విక్రేతలు పట్టుబడతామన్న భయంతో అక్కడే తాగడానికి అనుమతించడంలేదు. దీంతో యువకులు నిర్మానుష్య ప్రదేశాలకు, ఏపుగా పెరిగిన పంట పొలాల్లోకి వెళ్లి గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి సరఫరా చేసేవారు యువకులనే లక్ష్యంగా చేసుకొని అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, వైద్య విద్యార్థులను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. 

సులభ సంపాదన కోసం..

జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం కావడంతోపాటు పేద, రైతు కుటుంబాలే ఎక్కువ. అధికశాతం చదువుకునే వయసులో యువకులకు సంపాదన ఉండదు. ఇళ్లల్లో కూడా ఖర్చులకు పరిమితంగానే ఇస్తుంటారు. దీంతో కొంత మంది ఖర్చుల కోసం సులభంగా డబ్బుల సంపాదనకు అలవాటు పడి గంజాయి అమ్మకాలకు చొరవ చూపుతున్నారు. వీరి ద్వారా అయితే గంజాయి సులభంగా అమ్మవచ్చునని వ్యాపారులు వీరిని పావులుగా వాడుకుంటున్నారు. గంజాయి అమ్మి పెడితే రూ.1000 నుంచి రూ.1500 వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం.  

  • రైళ్లలో ఒకచోటు నుంచి మరోచోటుకు చేరిస్తే కిలో గంజాయికి రూ.1,500 చొప్పున చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.  
  • ఈ నెల మొదటి వారంలో వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏసీ బోగీలో రూ.3.5 లక్షల విలువైన 14 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా, అధికారులు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు.
  • జనవరి 12న వికారాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తరలిస్తున్న 77 కిలోల గంజాయిని వికారాబాద్‌ రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) పోలీసులు, ఆబ్కారీ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. 
  • మార్చి 24న హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌ మీదుగా వెళ్తున్న పూర్ణా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో వికారాబాద్‌లో దిగిన పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి 25 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

    కఠిన చర్యలు తీసుకుంటాం..

గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టేందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటున్నాం. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం.  
- విజయ్‌భాస్కర్, జిల్లా ఆబ్కారీ అధికారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని