జోరుగా జూదం

కష్టపడకుండానే సులువుగా డబ్బులు సంపాదించేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పట్టుబడుతున్నా తీరు మార్చుకోవడం లేదు.

Updated : 13 Jun 2024 05:13 IST

న్యూస్‌టుడే, కోరుట్ల

ష్టపడకుండానే సులువుగా డబ్బులు సంపాదించేందుకు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు పట్టుబడుతున్నా తీరు మార్చుకోవడం లేదు. యువకులు, వ్యాపారులు, నేతలు జూదంను వృత్తిగా కొనసాగిస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా మారడం లేదు. కోరుట్ల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చాలా ఏళ్లుగా స్థావరాలు ఏర్పాటు చేసుకుని జూదం నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మామిడితోటలు, వ్యవసాయక్షేత్రాలు, పట్టణంలో జూదం ఆడుతున్నారు. జూదంపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి నిర్వాహకులు రూ.లక్షల్లో దండుకుంటున్నారు. మద్యం, భోజనం ఇతర అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా స్థావరాలకు తీసుకెళ్లడం తర్వాత సురక్షితంగా పంపిస్తుంటారు. జూద స్థావరాల చుట్టూ మూడంచెల రక్షణగా వ్యక్తులను కాపలా ఉంచుతున్నారు. స్థానిక అధికారులకు ముడుపులు ముట్టజెప్పుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలో ఒక మండలంలో పక్క మండలానికి చెందిన పోలీసులు దాడులు చేసి జూదరులను పట్టుకున్నారు. పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసినా కోర్టులో జరిమానా కట్టి మళ్లీ జూదం కొనసాగిస్తున్నారు.   

ఇటీవల నమోదైన కేసుల వివరాలు..

  • ఈ నెల 7 కథలాపూర్‌ మండలం సిరికొండ గ్రామశివారులోని మామిడితోటలో 12 మంది జూదరులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద రూ.76 వేల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
  • ఏప్రిల్‌ 20న కోరుట్ల మండలం అయిలాపూర్‌(కిషన్‌రావుపేట్‌) శివారులో జూద స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. 18 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద రూ.1.51 లక్షల నగదు, 18 చరవాణులు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
  • జనవరి 13న కోరుట్ల పట్టణంలోని వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 12 మంది జూదరులను పట్టుకుని వారి వద్ద రూ.39,360 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు
  • గతేడాది సెప్టెంబర్‌ 23న కోరుట్ల బస్టాండ్‌ దగ్గర ఓ దుకాణంపై జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద రూ.89,500ల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని