పోలీసుల అదుపులో ఆరుగురు మావోయిస్టులు..!

ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

Published : 14 Jun 2024 04:39 IST

ఎన్‌కౌంటర్‌కు యత్నిస్తున్నారని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల

వెంకటాపురం, న్యూస్‌టుడే: ములుగు జిల్లా వెంకటాపురంలో పోలీసులు బుధవారం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు, మందుపాతరల గుర్తింపులో భాగంగా గ్రేహౌండ్స్, ప్రత్యేక పోలీసు బలగాలు వెంకటాపురం మండలంలోని తడపల అటవీ ప్రాంతానికి వెళ్లాయి. అభయారణ్యంలో అనుమానాస్పదంగా ఆరుగురు కనిపించడంతో అదుపులోకి తీసుకొని వెంకటాపురం పోలీసు సర్కిల్‌ పరిధికి తరలించారని, ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారని వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. నిరాయుధులుగా ఉన్న ముగ్గురు మావోయిస్టు దళసభ్యులు రీతా, మోతీ, ఇడ్మాల్‌తోపాటు పనుల కోసం అడవికి వెళుతున్న మరో ముగ్గురు గ్రామస్థులను పోలీసులు పట్టుకున్నట్లు అందులో పేర్కొన్నారు. వారిని ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆరుగురినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని డిమాండ్‌ చేశారు. తాము ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని వెంకటాపురం సీఐ బండారి కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని