ఏపీ, ఒడిశా నుంచి తరలిస్తున్న 930 కిలోల గంజాయి పట్టివేత

ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తీసుకువచ్చిన 930 కిలోల గంజాయిని నొయిడా, గ్రేటర్‌ నొయిడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో రూ.4 కోట్లు విలువ చేసే ఈ సరకుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురిని అరెస్టు చేశారు.

Published : 14 Jun 2024 05:43 IST

నొయిడాలో పట్టుబడ్డ నిందితులు 

నొయిడా: ఆంధ్రప్రదేశ్, ఒడిశాల నుంచి తీసుకువచ్చిన 930 కిలోల గంజాయిని నొయిడా, గ్రేటర్‌ నొయిడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లబజారులో రూ.4 కోట్లు విలువ చేసే ఈ సరకుకు సంబంధించి రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురిని అరెస్టు చేశారు. నొయిడాలో ఒక ట్రక్కులో 800 కిలోల గంజాయిని తరలిస్తూ ముగ్గురు, కారులో 130 కిలోలు తీసుకువెళ్తూ ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. రూ.60 లక్షల విలువైన 2,000 లీటర్ల పురుగుమందుల్ని ఒడిశా నుంచి ట్రక్కులో తీసుకువస్తూ వాటి మాటున 800 కిలోల గంజాయిని దాచారని పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి నొయిడాలోని ‘నేర స్పందన బృందం’ (సీఆర్‌టీ) అధికారులు దీనిని గుర్తించి పట్టుకున్నారు. ఎక్కడైనా తనిఖీలు జరుగుతుంటే వెంటనే అప్రమత్తం చేయడానికి ఈ వాహనానికి ముందు ఓ కారులో కొందరు వెళ్తున్నారని, ఆ కారును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రెండో ఘటనలో పట్టుబడ్డ వ్యక్తులు తాము 130 కిలోల గంజాయిని ఆంధ్రప్రదేశ్‌ నుంచి తక్కువ ధరకు కొని దిల్లీలో ఎక్కువ మొత్తానికి అమ్ముకునేందుకు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారని చెప్పారు. రెండు కేసుల్లోనూ ‘మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల చట్టం’ కింద ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టారు. నిందితులు బిహార్, హరియాణాలకు చెందినవారు. వీరిలో ఒకడైన గ్యాంగ్‌లీడర్‌ సుదామ చౌధరి గతంలో ఇలాంటి కేసులో అరెస్టయి రెండు నెలల క్రితం కారాగారం నుంచి విడుదలయ్యాడని నొయిడా అదనపు డీసీపీ మనీశ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని