అదుపు తప్పి లారీ బోల్తా.. ఇద్దరు ఉద్యోగుల మృతి

లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది.

Updated : 15 Jun 2024 06:37 IST

గూడూరు, న్యూస్‌టుడే: లారీ అదుపు తప్పి బోల్తాపడడంతో విధులకు వెళ్తున్న ఓ పోలీసు కానిస్టేబుల్, ఒప్పంద ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలో 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గూడూరు మండలంలోని కొంగరిగద్ద గ్రామానికి చెందిన ధనసరి పాపారావు(35) గూడూరు ఠాణాలో కానిస్టేబుల్‌(సీఐ గన్‌మెన్‌)గా పనిచేస్తున్నారు. ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై విధులకు బయలుదేరగా.. మార్గం మధ్యలో వరుసకు సోదరుడైన మచ్చర్ల గ్రామస్థుడు చుంచ దేవేందర్‌(34) గ్రామ బస్‌స్టాప్‌లో కనిపించడంతో ఆగి మాట్లాడారు. అతను ములుగు జిల్లా రాయినిగూడెం గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో ఒప్పంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై గూడూరులోని బస్టాండుకు వచ్చారు. అనంతరం మూలమలుపులో టీ తాగేందుకు వెళ్లారు. అదే సమయంలో మహబూబాబాద్‌ నుంచి నర్సంపేట వైపు జామాయిల్‌ కలపతో వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి మూలమలుపు వద్ద అదుపు తప్పి వీరిద్దరూ నిలుచున్న చోట బోల్తా పడింది. వాహనం మీద పడడంతో పాపారావు, దేవేందర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్‌ పరారయ్యారు. మహబూబాబాద్‌ ఎస్పీ సుధీర్‌రామ్‌నాథ్‌కేకన్, గూడూరు ఎస్సై నగేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని