అప్పు తీసుకొని.. అంతమొందించాడు

ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Updated : 16 Jun 2024 06:23 IST

హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ మున్నూరు కృష్ణ 

బాన్సువాడ, న్యూస్‌టుడే : ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రెండు పడక గదుల కాలనీలో ఉండే తొడిమెల సాయిబాబా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు ఆడుతూ.. రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. పై అంతస్తులో ఉండే సాయవ్వ వద్ద రూ.20వేలు అప్పు తీసుకొని పత్రం రాసిచ్చాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కొనసాగిస్తూ.. కొంత అప్పు తీర్చాలని భావించాడు. అందుకు ఒంటరిగా ఉన్న సాయవ్వను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 11న రాత్రి 12గంటల సమయంలో వృద్ధురాలికి ఫోన్‌ చేసి తన కుటుంబ సభ్యులు తలుపులు తీయడం లేదని నిద్రలేపాడు. నిజమే అనుకున్న సాయవ్వ అతనిని ఇంట్లోకి రానిచ్చారు. తెల్లవారుజామున వృద్ధురాలు గాఢ నిద్రలో ఉందని తెలిసి తెచ్చుకున్న కత్తితో వృద్ధురాలి మెడ కోసి చంపాడు. మృతిచెందిందని నిర్ధారించుకున్న నిందితుడు బంగారు ఆభరణాలు తీసుకొని బయట నుంచి గొళ్లెం పెట్టి తన ఇంట్లోకి వెళ్లాడు. వృద్ధురాలి కుటుంబీకులు ఉదయం ఆమెకు ఫోన్‌ చేసినా ఎత్తకపోవడంతో పక్కనే ఉన్న వారిని పంపించారు. వారు వెళ్లి చూసేసరికి సాయవ్వ మృతి చెంది ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయిబాబా కొంత బంగారం తాకట్టుపెట్టి రూ.40వేల రుణం తీసుకొన్నాడు. కొంత డబ్బు అప్పు తీర్చి మిగతా డబ్బులతో బెట్టింగ్‌లు చేశాడు. వృద్ధురాలి చరవాణికి వచ్చిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా సాయిబాబాపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకొన్నారు. ఎత్తుకెళ్లిన రెండు తులాల బంగారం, 15తులాల వెండిని రికవరీ చేసి నిందితుడిని రిమాండ్‌ చేసినట్లు సీఐ వివరించారు. కేసు ఛేదించడానికి సహకరించిన సిబ్బందిని ఆయన అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని