మావోయిస్టుల భారీ కుట్ర భగ్నం

ఇన్‌ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

Published : 16 Jun 2024 06:34 IST

మందుపాతరలు అమర్చుతున్న ఆరుగురి అరెస్టు

అరెస్టైన మావోయిస్టులు, మిలీషియా సభ్యులు, స్వాధీనం చేసుకున్న పేలుడు సామగ్రిని చూపుతున్న ఎస్పీ శబరీష్, పోలీసులు

ములుగు టౌన్, న్యూస్‌టుడే: ఇన్‌ఫార్మర్లు, పోలీసులే లక్ష్యంగా మందుపాతరలు అమర్చేందుకు యత్నించిన మావోయిస్టుల భారీ కుట్రను ములుగు జిల్లా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. వెంకటాపురం మండలం తడపల గ్రామ సమీపంలో వాటిని అమర్చుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలను శనివారం ములుగు జిల్లా కేంద్రంలో ఎస్పీ శబరీష్‌ విలేకరులకు వెల్లడించారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దు కర్రెగుట్టపై కాలిబాటలో మావోయిస్టులు, మిలీషియా సభ్యులు ఈ నెల 13న పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా వారిని చూసి ఆరుగురు అనుమానితులు పారిపోయేందుకు యత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. మందుపాతరలు అమర్చేందుకు  యత్నిస్తున్నట్లు వెలుగుచూసింది. పట్టుబడిన వారిలో వెంకటాపురం-వాజేడు ఏరియా డిప్యూటీ దళ కమాండర్‌ కారం బుద్రి అలియాస్‌ రీతా, పామేడు ఏరియా కమిటీ దళ సభ్యురాలు సోడి కోసి అలియాస్‌ మోతే, ఒకటో బెటాలియన్‌ సభ్యుడు సోడి విజయ్‌ అలియాస్‌ ఇడుమ, మిలీషియా సభ్యులు కుడం దస్రు, సోడి ఉర్ర, మడకం భీమా ఉన్నారు. రీతాపై 30 కేసులు ఉన్నాయని, మడూరి భీమేశ్వర్‌రావు, కొర్స రమేశ్‌ల హత్య, ఇటీవల ప్రెషర్‌బాంబు పేలి మృతిచెందిన ఏసు కేసులో నిందితురాలిగానూ ఉన్నట్లు ఎస్పీ వివరించారు. మిగిలిన వారిపై కూడా పలు కేసులున్నాయన్నారు. వీరి నుంచి ఓ తుపాకీ, రెండు వాకీటాకీలు, ప్రెషర్‌ కుక్కర్, కత్తులు, బుల్లెట్లు, పేలుడు సామగ్రిని స్వాధీనపరచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని