ఉపాధి లేక... పూట గడవక..!

రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు.

Published : 16 Jun 2024 06:35 IST

రైలు కిందపడి చేనేత కార్మికుడి ఆత్మహత్య 

కరీంనగర్‌ కొత్తపల్లి, న్యూస్‌టుడే: రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం. పైగా ఆరు నెలలుగా పనిలేదు. పూట గడవని దుస్థితితో కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక కుంగిపోయిన ఓ చేనేత కార్మికుడు రైలు కిందపడి ప్రాణం తీసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం... కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలోని రెడ్డిరామయ్యపల్లికి చెందిన బొల్లబత్తిని వెంకటేశం(63) ఉపాధి నిమిత్తం గతంలో భీవండి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిరిసిల్లలో ఏర్పాటు చేసిన పవర్‌లూమ్స్‌లో ఉపాధి లభించడంతో ఇక్కడికే వచ్చారు. పదేళ్లుగా సిరిసిల్లలోని పవర్‌లూమ్స్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. అయితే, ఆరు నెలలుగా పవర్‌లూమ్స్‌ కార్మికులకు ఉపాధి లేకపోవడంతో వెంకటేశం ఇంటి వద్దనే ఉంటూ పనికోసం సిరిసిల్ల వెళ్లి వస్తుండేవారు. ఉపాధి దొరుకుతుందనే నమ్మకంతో తెలిసిన వారి వద్ద రూ.2 లక్షల వరకు అప్పు చేశారు. ఆరు నెలలు గడిచినా పని దొరక్కపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక దిగాలుగా ఉండేవారు. శుక్రవారం సాయంత్రం సిరిసిల్లకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పిన వెంకటేశం కొత్తపల్లి రైల్వేస్టేషన్‌ పట్టాలపై శవమై కనిపించారు. రైల్వే పోలీసులు.. వెంకటేశం జేబులోని ఆధార్‌కార్డుపై ఉన్న చిరునామా ఆధారంగా శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం పోస్టుమార్టం కోసం శవాన్ని కరీంనగర్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ ఆధారం తెగిపోయిందని, ఆడపిల్లకు పెళ్లి ఎలా చేయాలని, కొడుకును ఎలా బతకించాలంటూ వెంకటేశం భార్య ఇందిర కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక వెంకటేశం ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని