గోవుల రవాణా నేపథ్యంలో ఘర్షణ

గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్‌ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది.

Updated : 16 Jun 2024 06:28 IST

మెదక్‌లో ఓ వ్యక్తికి కత్తిపోట్లు; మరో ఇద్దరికీ గాయాలు
రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు

ప్రైవేట్‌ ఆసుపత్రిలో ధ్వంసమైన కంప్యూటర్లు

మెదక్‌ అర్బన్, న్యూస్‌టుడే: గోవుల రవాణాను కొందరు అడ్డుకోవడంతో మొదలైన గొడవ.. చినికి చినికి గాలివానగా మారి ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో మెదక్‌ పట్టణంలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఓ వర్గం వారు ఆవులను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న మరో వర్గానికి చెందిన వ్యక్తులు శనివారం రాత్రి స్థానిక బంగ్లాచెరువు వద్దకు వచ్చి అడ్డుకోవడంతో గొడవ ప్రారంభమైంది. మెదక్‌ డీఎస్పీ రాజేశ్‌ వచ్చి ఇరువర్గాలను సముదాయించారు. గోవులను స్థానిక తితిదే కల్యాణ మండపం ఆవరణలో ఉంచారు. ఈలోగా పట్టణంలోని నర్సిఖేడ్‌లో కూడా మరికొన్ని గోవులున్నట్లు తెలుసుకున్న ఓ వర్గం వారు వెళ్లగా.. అక్కడా ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గం వ్యక్తులు ఠాణాకు వెళ్లి పోలీసులు పట్టించుకోవడంలేదంటూ రహదారిపై ఆందోళన చేశారు. తరువాత వారు నర్సిఖేడ్‌కు వస్తుండగా.. దారిలో మరోసారి పరస్పర దాడులు జరిగాయి. ఒక వర్గానికి చెందిన వ్యక్తిని కత్తితో పొడవడంతో అతడికి గాయాలయ్యాయి. దీంతో ఆ వర్గానికి చెందిన వారు మళ్లీ ఠాణాకు వస్తుండగా.. ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి లోపలి నుంచి మరో వర్గం వారు రాళ్లతో దాడికి దిగారు. దీంతో రెండో వర్గం వారు ఆసుపత్రిలో అద్దాలు, సామగ్రిని, ఒక కారును ధ్వంసం చేశారు. పోలీసులొచ్చి లాఠీఛార్జితో వారిని చెదరగొట్టారు. దీంతో ఆ వర్గం వారు వెళ్లిపోయిన.. కర్రలు చేతబూని రోడ్లపైకి వచ్చారు. అవతలి వర్గానికి చెందిన దుకాణాలపై దాడులు చేశారు. మరో ప్రైవేట్‌ ఆసుపత్రిలో సామగ్రి, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఓ భవనంపై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలాయి. కత్తి దాడిలో ఒక వర్గం వ్యక్తి కుడిచేతికి, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. రెండో వర్గానికి చెందిన ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ఐజీ రంగనాథ్‌ ఆధ్వర్యంలో ఎస్పీ బాలస్వామి పరిస్థితిని పర్యవేక్షించారు. పట్టణంలో పోలీసు పికెట్లు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి బలగాలను రప్పిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని