బీమా కొత్తకొత్తగా.. కసరత్తులో యంత్రాంగం

చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంతో పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు చేతికి వచ్చే దశలో పంటలు నాశనమవుతున్నాయి.

Updated : 18 Jun 2024 06:16 IST

గత ఏడాది నీరు లేక ఎండిపోయిన వరి పొలం

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ: చిరుజల్లులు కురవగానే రైతన్నలు సంతోషంతో పొలం పనులు ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. విత్తనాలు వేయడం మొదలు శ్రమిస్తారు. ప్రకృతి వైపరీత్యాలకు చేతికి వచ్చే దశలో పంటలు నాశనమవుతున్నాయి. ఈ విషయంపై దృష్టి సారించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలకు బీమా అందజేస్తున్నాయి. గత ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం నిలిపి వేసిన పంటల బీమా పథకాన్ని కొత్త విధివిధానాలతో అమలు చేయడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం: వందశాతం ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించి భరోసా కల్పించడానికి సన్నద్ధమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో పంటల బీమా పథకం అమలు, జిల్లా అధికారులు రైతులతో చర్చలు జరిపి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ సీజన్‌ నుంచి నూతన బీమా పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 95 శాతం, మిగిలిన 5 శాతం ప్రీమియం రైతులు చెల్లించేలా గతంలో అమలు చేశారు. కొన్ని సమస్యలు ఎదురవడంతో ఉపయోగం లేదని ఈ పథకాన్ని గత ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిలిపివేసింది.

జీవో విడుదలే తరువాయి: నూతన బీమా పథకంలో క్లస్టర్ల వారిగా క్రాప్‌ బుకింగ్‌ను పరిగణనలోకి తీసుకోనున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలు సందర్శించి సమాచారాన్ని సేకరించి నమోదు చేసుకుంటున్నారు. క్రయవిక్రయాలు, ఉత్పత్తుల్లో లాభనష్టాలపై వివరాలు సేకరిస్తున్నారు. రైతుల నుంచి బయోమెట్రిక్‌ డిక్లరేషన్‌ తీసుకుని బీమా అమలుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. తుది మార్గదర్శకాల రూపకల్పన, బీమా కంపెనీతో ఒప్పందం.. ప్రీమియం నిర్ధారణతో విధివిధానాలతో జీవో విడుదల కానుంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 3.23 లక్షల రైతులు 5.46 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. వానాకాలం యాసంగి సీజన్లో ప్రధాన పంటలుగా ఎక్కువగా పత్తి, వరి, మొక్కజొన్న, కంది, వేరుశనగ పంటలు పండిస్తున్నారు. మిగతా పంటలు నామమాత్రంగానే సాగవుతున్నాయి రైతులకు మేలు జరిగే విధంగా జీవో జారీ కానుందని జిల్లా వ్యవసాయ అధికారి పి.మహేశ్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని